Hyderabad: బంజారాహిల్స్‌లోని బీఎస్‌డీ డీఏవీ పబ్లిక్ స్కూల్‌ ఘటన.. చర్యలు చేపట్టిన తెలంగాణ విద్యాశాఖ

Hyderabad Banjara Hills Bsd Dav School Recognition Cancelled - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని బీఎస్‌డీ డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఈ పాఠశాల ప్రిన్సిపాల్‌కు డ్రైవర్‌గా పనిచేసే రజినీకుమార్.. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతన్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇందుకు సంబంధించి అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు.

డ్రైవర్ రజినీకుమార్ అరాచకాలను స్కూల్‌లో పనిచేసే టీచర్లు విద్యాశాఖ అధికారులకు తెలిపారు. అతనిపై ప్రిన్సిపాల్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. పాఠశాలలో చాలా మంది విద్యార్థినులపై అతడు లైగింక వేధింపులకు పాల్పడినట్లు అధికారులు విచారణలో గుర్తించారు. విద్యార్థులు, టీచర్ల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. స్కూల్‌, బయట ఉన్న సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. 

వేరే స్కూళ్లలో సర్దుబాటు
పాఠశాల గుర్తింపు రద్ధు చేయడంతో విద్యార్థులు నష్టపోకుండా వాళ్లను వేరే స్కూళ్లలో సర్దుబాటు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా విద్యా శాఖ అధికారిదేనని స్పష్టం చేశారు.

కమిటీ ఏర్పాటు
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సబిత ప్రకటించారు . ఈ కమిటీలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీస్ విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని పేర్కొన్నారు.

ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యతపై ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి హామీపత్రం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

కట్టలుతెంచుకున్న ఆగ్రహం..
ఎల్‌కేజీ చదువుతున్న బాలికను రజినీకుమార్ గత రెండు నెలలుగా వేధిస్తున్నాడనే ఆరోపణలతో ఆమె తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం పాఠశాలకు చేరుకుని నిలదీశారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో అతనికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో విద్యాశాఖ వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది.
చదవండి: విద్యార్థినిని వేధిస్తున్న స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కారు డ్రైవర్‌.. చితకబాదిన తల్లిదండ్రులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top