
చేతబడి అనుమానంతో చిన్నారిని చంపేసిన దంపతులు
ఇరువురి అరెస్టు...రిమాండ్
చంచల్‌గూడ: మూడ నమ్మకమనే పెనుభూతం ఒక చిన్నారి ప్రాణం బలితీసుకుంది. అనారోగ్యంతో కన్న కూతురు చనిపోతే..అందుకు కారణం చేతబడే అని నమ్మి, అందుకు తోడు ఆస్తి వివాదం కొనసాగుతుండటంతో సోదరి కూతుర్ని చంపేశాడో కిరాతకుడు. శనివారం మాదన్నపేట పీఎస్‌లో సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..చావణీలో నివాసం ఉండే మీర్ సమీ అలీ స్థానికంగా వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. అతని భార్య యాస్మీన్ బేగం గృహిణి. కాగా సమీ కుమార్తె గతేడాది నవంబర్‌లో అనారోగ్యంతో మృతి చెందింది. దీనికి చేతబడే కారణమని సమీ అనుమానించాడు.
దీనికి తోడు సమీకి సోదరి, సోదరులతో ఆస్తి వివాదం ఏర్పడింది. తన తల్లి ఆస్తిని తన పేరున రాయించుకుని సోదరి, సోదరులకు కొంత డబ్బులు ఇస్తానని సమీ హామీ ఇచ్చాడు. కానీ ఇవ్వకపోవడంతో వారంతా ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో తన కూతురు చేతబడి వల్లే మృతి చెందిందని ధృఢంగా నమ్మిన సమీ..లోలోపల తన సోదరి షబానా బేగంపై ప్రతీకారంతో రగిలిపోయాడు. గత మంగళవారం మధ్యాహ్నం షబానా బేగం తన కుమార్తె ఉమ్మేహని సుమయ (7)తో కలిసి తల్లి ఇంటికి వచి్చంది. బాలికను వదిలేసి షాపింగ్‌కు చారి్మనార్ వెళ్లింది.
ఇదే అదునుగా భావించిన సమీ దంపతులు సుమయను ఆడుకుందామని నమ్మించి పిలిచి..బెడ్‌షీట్‌తో వెనక నుంచి చేతులు కట్టేసి బిల్డింగ్ మీదకు తీసుకెళ్లి బతికుండగానే వాటర్ ట్యాంక్‌లో పడేసి మూత పెట్టి వెళ్లిపోయారు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పరిశీలించగా వాటర్ ట్యాంక్‌లో శవమై కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులను విచారించగా సమీ దంపతులు నేరాన్ని అంగీకరించారు. భార్యా భర్తలిద్దర్నీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో సైదాబాద్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, మాదన్నపేట ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు.