Hyderabad: సాక్ష్యాలు లేక క్లోజవుతున్న కేసులు.. 2021లో ఎన్నో తెలుసా?

Hyderabad: 23 Percent Cases Closed in 2021, Says NCRB Report - Sakshi

గతేడాది నమోదైన వాటిలో ఏకంగా 23.66 శాతం

సిటీలో రిజిస్టర్‌ అయిన కేసుల సంఖ్య 20,142

వీటిలో ఇలా మూతపడినవి ఏకంగా 4,766

స్పష్టం చేస్తున్న ఎన్సీఆర్బీ–2021 గణాంకాలు 

సాక్షి, హైదరాబాద్‌: నేరం జరిగింది... ఫిర్యాదు అందింది... కేసు నమోదైంది... అయితే నిందితుడిని పట్టుకోవడానికి అవసరమైన సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నగరంలో అనేక కేసులు మూతపడుతున్నాయి. ఇలా ఒకటి, రెండు కాదు ఏకంగా 23.66 శాతం కేసులు 2021లో క్లోజ్‌ అయ్యాయి. నగర కమిషనరేట్‌ పరిధిలో గత ఏడాది మొత్తమ్మీద 20,142 కేసులు నమోదు కాగా... వీటిలో 4,766 ఈ కారణంగానే మూతపడ్డాయి.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణాన్నే పోలీసు పరిభాషలో ‘ట్రూ బట్‌ ఇన్‌సఫీయంట్‌ ఎవిడెన్స్‌/అన్‌ ట్రేస్డ్‌/నో క్లూ’ అంటారు. ‘ఇలా మూతపడిన కేసులన్నీ గతేడాదికే సంబంధించినవి కాకపోవచ్చు. అంతకు ముందు సంవత్సరాల్లో రిజిస్టరైనవి కూడా ఉండి ఉంటాయి’ అని నగరానికి చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.  

రెండు చట్టాల కింద కేసులు.. 
► సాధారణంగా పోలీసులు రెండు రకాలైన చట్టాల కింద కేసులు నమోదు చేస్తుంటారు. మొదటిని ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) అయితే... రెండోది ఎస్‌ఎల్‌ఎల్‌గా పిలిచే స్థానిక చట్టాలు. 2021కి సంబంధించి సిటీలో ఐపీసీ కేసులు 17,951, ఎస్‌ఎల్‌ఎల్‌ కేసులు 2191 నమోదయ్యాయి. వీటిలో 4034, 723 కేసులు ఇలా క్లోజ్‌ అయినవే. 

► మహిళలపై జరిగే నేరాలకు ఇతర కేసుల కంటే ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈ కేటగిరీకి చెందిన కేసులూ ఆధారాలు లేక క్లోజ్‌ అయిపోతున్నాయి. క్రైమ్‌ ఎగనెస్ట్‌ ఉమెన్‌కి సంబంధించి గతేడాది మొత్తం 2755 కేసులు నమోదు కాగా వీటిలో 598 ఇలానే మూతపడ్డాయి. చిన్నారులపై జరిగిన నేరాలు కేసులు 621 రిజిస్టర్‌ కాగా... 89 ఇలా క్లోజ్‌ అయ్యాయి. వృద్ధులపై జరిగిన నేరాల సంఖ్య 314గా, మూతపడినవి 101గా ఉన్నాయి.  

► షెడ్యూల్డ్‌ కులాలపై జరిగిన నేరాలకు సంబధించి 104 కేసులు నమోదు కాగా వీటిలో 34 ఆధారాలు లేక క్లోజ్‌ అయ్యాయి. షెడ్యూల్‌ తెగలకు సంబంధించి 28 నమోదు కాగా, 8 ఇలానే మూతపడ్డాయి. ఆర్థిక నేరాల కేసులు 4860 కాగా 1479 ఆధారాలు లభించక మూతపడ్డాయి. సైబర్‌ నేరాల విషయానికి వస్తే నమోదైన కేసులు 3303, ఇలా మూతపడినవి 1873గా ఉన్నాయి.  

నగరంలోనే ఎక్కువ.. 
► ప్రభుత్వ అధికారుల విధులు అడ్డుకుని, దాడికి పాల్పడిన ఉదంతాలు 2021లో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య హైదరాబాద్‌ 20గా ఉండగా... ముంబై 10, ఢిల్లీ 8, బెంగళూరు 7 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.   

► రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ప్రవర్తించడం వంటి ఉదంతాలకు సంబంధించిన కేసుల విషయంలోనూ సిటీ మొదటి స్థానంలో ఉంది. ఈ కేటగిరీకి చెందిన కేసులు నగరంలో 28 రిజిస్టర్‌ కాగా... ఢిల్లీ 17, కోల్‌కతా 13, బెంగళూరు 10, ముంబై 5 నమోదయ్యాయి.  

► వివిధ రకాలైన మోసాలతో కూడిన ఫ్రాడ్స్‌ కేటగిరీ కేసుల నమోదులోనూ హైదరాబాద్‌ కమిషనరేట్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఈ కేటగిరీలకు చెందిన 2771 కేసులు నమోదయ్యాయి. ఇతర మెట్రో నగరాలైన జైపూర్, ఢిల్లీ, జైపూర్, ముంబై, బెంగళూరుల్లో వీటి సంఖ్య 1488, 1414, 970, 362గా ఉంది. (క్లిక్‌: హైదరాబాద్‌లో మరో నేతపై పీడీ యాక్ట్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top