సాహో.. సాహసీ!

HYD man Reached Base Camp In Himalayas in Frst Step - Sakshi

ఏడు రోజుల్లో లక్ష్యాన్ని ఛేదించిన సందీప్‌ 

సాక్షి, మీర్‌పేట: ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్న ఆ యువకుడు మొదటి అడుగులో హిమాలయాల్లోని బేస్‌ క్యాంప్‌ను చేరుకున్నాడు. మీర్‌పేట టీఆర్‌ఆర్‌ టౌన్‌షిప్‌కు చెందిన వేముల సందీప్‌ హైటెక్‌ సిటీలోని ఆటోమేటిక్‌ డేటా ప్రాసెసింగ్‌ (ఏడీపీ) కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసున్నాడు. బాల్యం నుంచే ఎత్తయిన కొండలను అధిరోహించాలని బలమైన కోరిక ఉండేది. ఈ క్రమంలో చిన్న చిన్న సాహస యాత్రలకు శ్రీకారం చుట్టాడు.

ఎవరెస్ట్‌ శిఖరంతో పాటు ప్రపంచంలోని ఎత్తయిన 7 శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఈ నెల 4న నేపాల్‌లోని 5,364 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ సాహస యాత్రతో ఏడు రోజుల్లో లక్ష్యాన్ని చేరుకున్నాడు. మరో మూడు రోజుల్లో కిందికి చేరుకున్నాడు. సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందీప్‌ శనివారం అర్ధరాత్రి తిరిగి నగరానికి చేరుకున్నాడు.  

మైనస్‌ 18 డిగ్రీల చలిలో.. 
ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడమే నా లక్ష్యం. దేశంలోని పలు ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌లకు వెళ్లాను. కేవలం ఒకే గైడ్‌ సహాయంతో యాత్రను ప్రారంభించి 7 రోజుల్లో ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ లక్ష్యానికి చేరుకున్నా. మైనస్‌ 18 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో, ఆక్సిజన్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేకుండా, మాత్రలు వాడకుండా తిరిగి మూడు రోజుల్లో కిందికి చేరుకుని యాత్రను విజయవంతంగా పూర్తి చేశా. ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే 12 రోజుల్లో పూర్తి చేయాల్సిన సాహసయాత్రను 10 రోజుల్లో పూర్తి చేశా. టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నాను. 
– వేముల సందీప్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top