హుజురాబాద్‌ ఉప పోరు: అసలీ పోలింగ్‌ కేంద్రమేంటి? ఎవరెవరి పాత్ర ఎంత..ఓటు వేయడమెలా?

Huzurabad Bypoll: Full Details About Polling Center, Officials Role, Voting Process - Sakshi

సాక్షి, కరీంనగర్‌: హుజురాబాద్‌ పోలింగ్‌కు అస్త్రశస్త్రాలు సిద్ధమయ్యాయి. అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల క్రతువుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశమే ఎదురుచూస్తున్న యుద్ధానికి ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల వద్ద సదుపాయాలు సమకూర్చిన అధికారులు ఈ నెల 30న పోలింగ్‌ నిర్వహణకు సమాయత్తమయ్యారు. శనివారం ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కార్యనిర్వాహక దళం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బాధ్యత గల పౌరులుగా మనం ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. ఓటు వేసే సమయంలో పరిసరాలపై అవగాహన అవసరం. అసలు పోలింగ్‌ కేంద్రంలో ఎంత మంది ఉంటారు..? వారు ఏం చేస్తారు..? మనకు సందేహం వస్తే ఎవరిని అడగాలి..? ఓటింగ్‌ యంత్రాలు ఎక్కడ ఉంటాయి..? తదితర అంశాలను ప్రస్తావిస్తూ కథనం.

సహాయ ప్రిసైడింగ్‌ అధికారి
ఓటరు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లగానే మొదట సహాయ ప్రిసైడింగ్‌ అధికారి ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్‌ కార్డు), ఓటరు స్లిప్‌ను పరిశీలించి ఓటరు జాబితా (మార్కింగ్‌ కాపీ)లో నమోదు చేసుకుంటారు. అటుపై పోలింగ్‌ కేంద్రంలో ఉన్న ఆయా పార్టీల ఏజెంట్లకు వినిపించేలా ఓటరు పేరు వివరాలను చదువుతారు. వెల్లడించిన వివరాలను పోలింగ్‌ కేంద్రంలోని ఆయా పార్టీల ఏజెంట్లు నమోదు చేసుకుంటారు.

మూడో అధికారి
మరో రెండడుగులు వేశాకా అధికారి కనిపిస్తారు. ఇతడు ఓటరుకు చెరిగిపోని సిరా గుర్తును పెట్టి అనంతరం ఓటరు రిజిష్టర్‌గా వ్యవహరించే ఫాం 17ఏ లో వివరాలు నమోదు చేసుకుంటారు. ఓటరు సంతకాన్ని తీసుకుని ఓటరు స్లిప్‌ను అందిస్తారు. 

నాలుగో అధికారి
సిరా మార్క్‌ను రూడీ చేసుకొని ఓటరు స్లిప్‌ తీసుకొని, కంట్రోల్‌ యూనిట్‌లో బ్యాలెట్‌ను జారీ చేస్తారు. అప్పుడు బిజిలైట్‌ వెలగడంతో పాటు ఈవీఎంపై పచ్చ (గ్రీన్‌) లైట్‌ వెలుగుతుంది. అనంతరం ఓటరు కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి తను ఎంచుకున్న అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న మీటాను నొక్కాలి. పక్కనే ఎడమ వైపుగా ఏర్పాటు చేసిన వీవీప్యాట్‌లో 7 సెకన్ల పాటు తాను వేసిన ఓటును నిర్ధారించుకునే అవకాశాన్ని వినియోగించుకొని పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు వెళ్లాలి.

పోలింగ్‌ కేంద్రం
పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ అధికారితో పాటు సహాయ ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు ఎన్నికల అధికారులు విధులు నిర్వహిస్తారు. 

ప్రిసైడింగ్‌ అధికారి
పోలింగ్‌ కేంద్రంలో అన్ని వ్యవహారాలకు పూర్తి బాధ్యత ప్రిసైడింగ్‌ అధికారిదే. ఈయన నియోజకవర్గ కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రి తీసుకొని ప్రత్యేక వాహనాల్లో తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రానికి చేరవేస్తారు. ఓటింగ్‌ పూర్తయ్యాక అప్పగిస్తారు. పోలింగ్‌ కేంద్రంలో పర్యవేక్షణ చేస్తారు. 

ఈవీఎం పరికరాలు ఇలా..
ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలో మూడు పరికరాలు ఉంటాయి. అవి కంట్రోల్‌ యూనిట్, బ్యాలెట్‌ యూనిట్, వీవీప్యాట్‌. కంట్రోల్‌ యూనిట్‌ పోలింగ్‌ అధికారి (మూడో అధికారి) వద్ద ఉంటుంది. దీన్ని ఈయనే నియంత్రిస్తుంటారు. బ్యాలెట్‌ యూనిట్‌ అంటే ఓటరు మీట నొక్కే విభాగం. దీంతోనే ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీవీ ప్యాట్‌ను బ్యాలెట్‌ యూనిట్‌కు ఎడమ వైపుగా ఏర్పాటు చేస్తారు. మీట నొక్కిన తరువాత వీపీ ప్యాట్‌ సరిచూసుకోవడానికి వీలు కల్పిస్తూ ఏడు సెకన్ల పాటు నిలిచి ఉంటుంది. తర్వాత అది కట్‌ అయి ఎంపిక చేసిన బాక్స్‌లో పడుతుంది.

ఏదైనా ఒకటి తప్పనిసరి
ఓటు వేసేందుకు వెళ్లేటపుడు ఓటర్లు కింద పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి తప్పక ఉంచుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

►ఓటరు చీటి
►ఆధార్‌ కార్డు
►పాస్‌పోర్టు
►డ్రైవింగ్‌ లైసెన్స్‌
►పాన్‌కార్డు
►ఓటరు గుర్తింపు కార్డు
►ఉపాధి కూలీ కార్డు
►కార్మికుల ఆరోగ్య కార్డు
►పింఛను ధ్రువీకరణ
►ఉద్యోగి ఫొటో గుర్తింపు కార్డు(ప్రభుత్వ, ప్రైవేటు)
►బ్యాంకు పాసుపుస్తకం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top