
హబీబ్‌నగర్‌లో కలకలం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
నాంపల్లి: తాళం వేసి ఉన్న ఇంట్లో అస్థిపంజరం లభ్యమైన సంఘటన హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చాంశనీయంగా మారింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమవారం స్థానిక యువకులు క్రికెట్ ఆడుతుండగా బాల్ తాళం వేసి ఉన్న ఇంట్లో పడింది. దీంతో ఓ యువకుడు బాల్ తీసుకువచ్చేందుకు ఇంటి వెనుకవైపు ఉన్న గోడ దూకి లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్లిన అతడికి రిఫ్రిజిరేటర్ ఎదుట అస్థి పంజరం కనిపించిది. అస్థి పంజరం చుట్టూ ఉన్న వస్తువులకు బూజు పట్టి ఉన్నాయి.
ఈ దృశ్యాన్ని అతను సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడమేగాక సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇది వైరల్ కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. దీనిపై సమాచారం అందడంతో ఆసిఫ్‌నగర్ ఏసీపీ బి.కిరణ్‌కుమార్, హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ టి.పురుషోత్తమ్ రావు తదితరులు సంఘటనా స్థలానికి పరిశీలించారు. ఫోరెన్సిక్ టీం, క్లూస్ టీం ఆధారాలు సేకరించాయి. అస్థిపంజరం ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కొన్నేళ్ల క్రితమే అతను మృతి చెంది ఉండవచ్చున భాస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సదరు ఇంటికి సంబంధించిన వ్యక్తులను ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్‌కు రప్పించే ప్రయత్నంలో చేశారు.
కుటుంబ సభ్యుల లెక్క తేలితేనే..
సదరు ఇంట్లో మునీర్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉండేవాడు. ఆయనకు పది మంది సంతానం. వీరిలో ఐదుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెలు. కరోనా కంటే ముందు అందరూ కలిసే ఉన్నారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు రావడంతో వారు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. ముర్గీ మార్కెట్‌లోని సదరు ఇంట్లో పెళ్లికాని సోదరుడు అమీర్ ఉన్నట్లుగా పోలీసులు చెబున్నారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ సభ్యుల మధ్య మాటలు లేకపోవడంతో ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియని నెలకొంది. ఆ తర్వాత ఏవరూ నాంపల్లికి వచ్చిన దాఖలాలు లేవు.
ఈ నేపథ్యంలో కేసును చేధించేందుకు పోలీసులు కుటుంబ సభ్యులందరినీ స్టేషన్‌కు రప్పించే ప్రయత్నం చేయగా కేవలం ఇద్దరు మాత్రమే పీఎస్‌కు వచ్చారు. మిగతా వారందరూ పోలీసులకు సహకరించడం లేదని తెలిసింది. మరికొరందరికి ఫోన్లు చేసినా అందుబాటులోకి రావడం లేదు. దీంతో అస్థి పంజరం ఎవరనేది తేల్చడం పోలీసులకు కష్టంగా మారింది. ఇంటి యజమాని విదేశాల్లో ఉంటాడని స్థానికులు చెబుతుండగా..పాత బస్తీలోనే ఉన్నారంటూ బంధువులు, పోలీసులు చెబుతున్నారు. పెళ్లి, ఆస్తి కోసం గొడవ పడిన అమీర్ ఖాన్‌ను ఎవరైనా హత్య చేసి తాళం వేశారా? లేక అతడే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా మునీర్ కుటుంబ సభ్యులందరూ ఒకే చోటకు వస్తే కానీ ఈ కేసు చిక్కు ముడి వీడేలా లేదు.