కేటాయించినవి ఖర్చు చేయలేదు | Heavy spending in some areas without approval of Assembly | Sakshi
Sakshi News home page

కేటాయించినవి ఖర్చు చేయలేదు

Aug 3 2024 5:49 AM | Updated on Aug 3 2024 5:49 AM

Heavy spending in some areas without approval of Assembly

అసెంబ్లీ ఆమోదం లేకుండానే కొన్ని పద్దుల్లో భారీ ఖర్చు 

భారీగా పన్నేతర రాబడుల 

అంచనాలు.. ద్రవ్యలోటును తక్కువగా చూపెట్టారు

రుణాలు, అడ్వాన్సులు, అనివార్య ఖర్చులు పెరిగిపోయాయి

ఆర్థిక నిర్వహణ విషయంలో గత ప్రభుత్వానికి కాగ్‌ అక్షింతలు

సభలో రెవెన్యూ, ఆర్థిక రంగాల కాగ్‌ నివేదిక ప్రవేశ పెట్టిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తప్పు పట్టింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను తన నివేదికలో అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. కేటాయింపులు, ఖర్చులు ఇష్టారాజ్యంగా జరిగాయని, కొన్ని పద్దుల్లో కేటాయించిన నిధులు ఖర్చు చేయలేదని, కొన్ని పద్దుల్లో మాత్రం అసెంబ్లీ ఆమోదం పొందకుండానే ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టిందని ఆక్షేపించింది.

డబుల్‌బెడ్‌ రూం ఇళ్లకు రూ.11వేల కోట్లు, గొర్రెలు, మేకల కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు, ఆయిల్‌పామ్‌ పెంపకానికి రూ.1000 కోట్లు, దళిత బంధు కింద రూ. 15,700 కోట్లు, రైతులకు రుణమాఫీ కింద కేటాయించిన రూ.3,964 కోట్లు ఖర్చు చేయకపోవడాన్ని తప్పు పట్టింది. 2014–21 వరకు రూ.2,89,115 కోట్ల అధిక వ్యయం జరిగిందని కూడా వెల్లడించింది. గత మూడేళ్ల పన్నేతర రాబడుల అంచనాలను భారీగా వేశారని, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయక గ్రాంట్లు రాకపోయినా అవే అంచనాలను రూపొందించారని తెలిపింది.

సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,06,977 కోట్లు ఎక్కువగా పెరిగిందని, పాలమూరు–రంగారెడ్డికి రూ.12,937 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.11,370 కోట్ల మూలధన వ్యయం ఎక్కువగా జరిగిందని వెల్లడించింది. ద్రవ్యలోటును ఆ ఆర్థిక ఏడాదిలో రూ.2,749 కోట్లు తక్కువగా చూపెట్టారని తెలిపింది.

2022–23 ఆర్థిక సంవత్సరంలో అనివార్య ఖర్చులు 43 శాతానికి చేరాయని, రుణాలు, అడ్వాన్సులు 150 శాతం పెరిగి మొత్తం బడ్జెట్‌లో 11 శాతానికి చేరాయని వెల్లడించింది. బడ్జెట్‌ వెలుపలి రుణాల విషయంలో స్పష్టత లేదని, డిస్కంల అప్పులను రూ.16వేల కోట్ల మేర తక్కువగా చూపెట్టారని కూడా కాగ్‌ ఆక్షేపించింది. ఈ మేరకు రెవెన్యూ, ఆర్థిక రంగాల కాగ్‌ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం  అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 

పురపాలకశాఖ ఖర్చు చేసింది రూ. 7,990 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 2022–23 సంవత్సరంలో కేటాయించిన రూ.10,591 కోట్లలో ఖర్చు చేసిన మొత్తం రూ. 7,990 కోట్లు మాత్రమే. ఈ విషయాన్ని కాగ్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. గ్రాంట్‌ కింద కేటాయించిన ఈ మొత్తంలో రూ. 3,832 కోట్లు సరెండర్‌ చేసిన మొత్తంగా పేర్కొంది. ఇందులో మెట్రో కనెక్టివిటీకి కేటాయించిన రూ. 500 కోట్లు పనులు ప్రారంభించనందున ఖర్చు కాలేదు.

ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీకి కేటాయించిన రూ.378 కోట్లు కూడా అదే పరిస్థితిలో ఖర్చు కాలేదు. ఓఆర్‌ఆర్‌కు కేటాయించిన రూ.200 కోట్లు విడుదల కాలేదు. హైదరాబాద్‌ పట్టణ సముదాయం కోసం కేటాయించిన రూ.151 కోట్లు, భూముల సేకరణకు కేటాయించిన రూ.100 కోట్లు కూడా వెనక్కి వెళ్లాయి. మూలధన విభాగం కింద రూ.151 కోట్లలో కేవలం రూ. 20,000 మాత్రమే వినియోగించబడినట్టు తెలిపింది.

కాంపాలో మిగిలిన రూ.1,114 కోట్ల బ్యాలెన్స్‌
2022–23 ఆర్థిక సంవత్సరం చివర్లో రాష్ట్ర ప్రత్యామ్నాయ అటవీకరణ నిధిలో (కాంపా) రూ.1,114 కోట్ల మొత్తం మేర బ్యాలెన్స్‌ మిగిలిపోయిందని కాగ్‌ పేర్కొంది. ఈ ఏడాది సందర్భంగా రూ.68 కోట్లు ఈ నిధిలోకి జమచేసి, మొత్తంగా ఈ నిధినుంచి రూ.404 కోట్లు కేటాయించిందని తెలిపింది. 2019 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం ‘స్టేట్‌ కాంపన్సెటరీ అఫారెస్టెషన్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేసిందని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement