తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక.. భద్రాచలంలో 144 సెక్షన్‌ విధింపు

Heavy Rains Alert For Telangana Godavari Dangerous At Bhadrachalam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. అంతేకాదు ఐదు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని తెలిపింది.  మరో మూడు రోజుల పాటు వర్షాల ప్రభావం ఉండడంతో..  మిగతా చోట్ల సైతం సాధారణం నుంచి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భద్రాచలం వద్ద..
అరుదుగా వరదలొచ్చే నదులు పొంగిపొర్లడంతో మూకుమ్మడిగా గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ప్రాణహిత, పెన్‌గంగా, వార్ధా నదులు వరదలతో ఉగ్రంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరాంసాగర్‌, కడెం నుంచి దిగువకు భారీగా వరద నీరు విడుదల అవుతోంది. భూపాలపల్లి జిల్లాలో గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. పలిమెల పోలీస్‌ స్టేషన్‌ నీట మునిగింది. మేడిగడ్డ కంట్రోల్‌ రూంలో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, కానిస్టేబుళ్లు కొందరు జలదిగ్భందంలో చిక్కుకున్నట్లు సమాచారం. అలాగే భద్రాద్రికి రాకపోకలు బంద్‌ అయ్యాయి. మిగిలిన ఏకైక మార్గం కూడా మూసివేశారు అధికారులు. అత్యవసరమైతేనే భద్రాద్రిలోకి అనుమతిస్తున్నారు. భద్రాచలం బ్రిడ్జిపై 48 గంటల పాటు రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలంలో 144 సెక్షన్‌ విధించారు. 48 గంటలపాటు ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం 62 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం.. రాత్రికి లేదంటే రేపు ఉదయానికి గోదావరి మట్టం 70 అడుగులకు చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.  గోదావరి జిల్లాలు డేంజర్‌ జోన్లో ఉన్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధికారులతో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఏపీలోనూ..
రాజమండ్రి:
ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉదృతంగా ఉంది. నీటిమట్టం 16 అడుగులు దాటింది. 17.75 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. అదే జరిగితే ఆరు జిల్లాలపై ప్రభావం పడనుంది. 42 మండలాల్లోని 524 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పోలవరం నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపులోకి మరికొన్ని ప్రాంతాలు. ఆచంట, యలంచిలి మండలాల్లో లంకగ్రామాలు నీట మునగ్గా.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద సహాయక చర్యల్లో ఏడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఐదు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొంటున్నాయి. స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఏపీ విపత్తుల శాఖ స్పెషల్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top