
వరద తాకిడికి బాసరలో నీటమునిగిన కాటేజీలు
బాసర కాటేజీల్లోకి గోదావరి వరద
ఇంకా జలదిగ్బంధంలోనే 765డీ జాతీయ రహదారి
హైవే 44కు మరమ్మతులు షురూ
సాక్షి, నెట్‌వర్క్: నిర్మల్ జిల్లాలోని భైంసా డివిజన్‌లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మరోవైపు మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోటెత్తిన వరద బాసర కాటేజీల్లోకి ప్రవేశించింది. వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా అక్కడికి చేరుకుని, పరిస్థితి సమీక్షించారు. విపత్తు నియంత్రణ సహాయక బృందాలతో కాటేజీల నిర్వాహకులు, సిబ్బందిని క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కాగా బాసర ఆలయ అర్చకులు గోదావరి శాంతించాలంటూ స్నానఘాట్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఇలావుండగా..భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఐదుగేట్లు ఎత్తారు. సుద్ధవాగు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఇళ్లలోకి వచ్చిన నీటిని తోడేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మెదక్ పట్టణంలో షాపుల్లో చేరిన నీటిని మోటార్లతో తోడుతున్నారు.
హైదరాబాద్ నుంచి మెదక్ –ఎల్లారెడ్డి–బాన్సువాడ మీదుగా నిజామాబాద్ జిల్లా కోటగిరి వరకు వెళ్లే 765డీ జాతీయ రహదారి ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. హైదరాబాద్–నాగ్‌పూర్ హైవే (44) కోతకు గురైన చోట్ల మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి.
హవేళీఘనపురం మండలం గంగమ్మవా గులో గల్లంతైన యాదగౌడ్ అనే మరో వ్యక్తి మృతదేహం శుక్రవారం లభించింది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య గల్లంతై మూడు రోజులైనా జాడ దొరకలేదు.
రైలు పట్టాల ధ్వంసానికి కబ్జాలే కారణం
భారీ వర్షాలతో రామేశ్వర్‌పల్లి–తలమడ్ల రైల్వేస్టేషన్‌ల మధ్య 528 మైలురాయి వద్ద 50 మీటర్ల పొడవున ట్రాక్ కింద మట్టి కొట్టుకపోయి పట్టాలు గాల్లో తేలడానికి చెరువు అలుగు కాలువ ఆక్రమణలే కారణమని తెలుస్తోంది.
గణపతి విగ్రహం కోసం వచ్చి చిక్కుకుపోయిన చిన్నారులు
కామారెడ్డి జిల్లా లింగంపల్లికలాన్ గ్రామానికి చెందిన సుమారు పది మంది చిన్నారులు బుధవారం గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు మెదక్‌కు వచ్చారు. అయితే రెండు జిల్లాల మధ్య ప్రవహిస్తోన్న మంజీరా నది పోచారం డ్యామ్‌పై నుంచి ఉప్పొంగి ప్రవహించడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో వారంతా రెండు రోజులుగా మెదక్‌లోనే ఉండిపోయారు. దీంతో శుక్రవారం ఉదయం ఎస్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌తో వారిని ఎల్లారెడ్డి వైపు తరలించేందుకు యత్నించారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చిన్నారులను మెదక్‌లోని పునరావాస శిబిరాలకు తరలించారు.