తెలంగాణ హక్కులు తాకట్టు పెట్టే కుట్ర | Harish Rao Letter to CM Revanth Reddy Over Tungabhadra water | Sakshi
Sakshi News home page

తెలంగాణ హక్కులు తాకట్టు పెట్టే కుట్ర

Jun 25 2026 1:58 AM | Updated on Jun 25 2026 1:58 AM

Harish Rao Letter to CM Revanth Reddy Over Tungabhadra water

కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను వెంటనే విరమించాలి

ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలు కాపాడాలి

కొడంగల్‌ లిఫ్టుకు కర్ణాటక ఎన్‌ఓసీ వెనుక మతలబేంటి?

కర్ణాటక ప్రభుత్వ అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలి

తుంగభద్ర జలాలపై సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు లేఖ

సాక్షి, హైదరాబాద్‌: తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా నీటిపారుదల ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు బుధవారం లేఖ రాశారు. ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తోంది.

నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తమ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందిస్తోంది. మరోవైపు తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో కూడా అదే ద్రోహ బుద్దితో సీఎం వ్యవహరిస్తూ పాలమూరు రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారు. కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు కర్ణాటక నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తెస్తున్నామనే సాకుతో తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారు.

తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి (2 టీఎంసీలు), చిక్కాలపర్వి (2.5 టీఎంసీలు), చిక్కాలమంచి (5 టీఎంసీలు) బ్రిడ్జ్‌–కమ్‌–బరాజ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపిందా? 2025 జూలై 18న కొడంగల్‌ లిఫ్ట్‌కు కర్ణాటక ఎన్‌వోసీ ఇవ్వడం వెనుక జరిగిన మతలబు ఏంటి? ఏడాది కాలంగా కర్ణాటక అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి మీరు అనుమతించినట్లేనా? తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 

ఆర్డీఎస్‌ నిర్వీర్వంపై ఆందోళన
‘కేటాయించిన నీటి కంటే ఇప్పటికే ఎక్కువగా వినియోగిస్తున్న కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు కూడా పూర్తయితే రాజోళిబండ డైవర్షన్‌ స్కీమ్‌ పూర్తిగా నిర్వీర్యమవుతుంది. చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా నారాయణ పేట, కొడంగల్‌కు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా దాన్ని పక్కనబెట్టారు. కమీషన్ల కొడంగల్‌ లిఫ్ట్‌ పేరిట భీమా ప్రాజెక్టు ఆయకట్టు రైతుల శాశ్వత ప్రయోజనాలను దెబ్బతీశారు. 16.94 టీఎంసీల కేటాయింపులో 7 టీఎంసీలను కొడంగల్‌ లిఫ్టుకు మళ్లించి రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించే భీమా ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు.

కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల ప్రభావం కేవలం ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టులకే పరిమితం కాదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు తాగునీటి అవసరాలు, భవిష్యత్తు నీటి ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతింటాయి’ అని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement