సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: పటాన్‌చెరులో 1972 నుంచి ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్‌ను అమెరికా సంస్థ లేదా అమెరికా రీసెర్చ్ సెంటర్ అని పిలవడం సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన రాహిత్యానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నల్లమల సరిహద్దులు, కృష్ణా–గోదావరి జలాలు, సుంకేశుల ప్రాజెక్టుల మీదే కాదు..కళ్ల ముందున్న సంస్థలపై కూడా సీఎంకు కనీస అవగాహన లేదు. ప్రాథమిక అవగాహన లేకుండా సీఎం తెలంగాణ పరువు తీస్తున్నాడు.
ఇక్రిశాట్ ఏ ఒక్క దేశానికీ చెందినది కాదు..ఇది సీజీఐఏఆర్ వ్యవస్థలో భాగమైన స్వతంత్ర అంతర్జాతీయ పరిశోధనా సంస్థ’అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. దీని ఏర్పాటులో ఎఫ్‌ఏఓ, యూఎన్డీపీ, వరల్డ్ బ్యాంక్ కీలక పాత్ర పోషించాయని, ప్రారంభంలో ఫోర్డ్, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్లతోపాటు భారత ప్రభుత్వం, పలు దేశాల మద్దతుతో నడుస్తున్న గ్లోబల్ వేదిక అని వివరించారు. ‘దాన్ని అమెరికా రీసెర్చ్ సెంటర్ అనడం దారుణం.
ఇంత ప్రాథమిక విషయాలు కూడా తెలియని స్థితిలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి’అని హరీశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా, వాస్తవాల ఆధారంగా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా నోటికి వచ్చినట్టు మాట్లాడటం మానుకొని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని హితవు పలికారు.


