శ్రమ మాది.. శిలాఫలకాలు మీవా? | Harish Rao Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

శ్రమ మాది.. శిలాఫలకాలు మీవా?

Mar 22 2026 5:01 AM | Updated on Mar 22 2026 5:01 AM

Harish Rao Comments On CM Revanth Reddy

ప్రజల మనోఫలకలపై ఎప్పటికీ మా పేరే 

పామాయిల్‌ ఫ్యాక్టరీకి కాళేశ్వరం ప్రాణాధారం 

సిద్దిపేటకు నిధులివ్వని సీఎం రేవంత్‌ ఏ ముఖం పెట్టుకుని వస్తావ్‌! 

బహిరంగ లేఖను విడుదల చేసిన మాజీ మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: ‘సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించే పనుల్లో ఏ ఒక్కటీ కాంగ్రెస్‌ తెచ్చింది, చేసింది కాదు. అవన్నీ బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించినవే. శ్రమ మాది.. శిలాఫలకాలు మీవా?’అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ కృషి ఫలితమే పామ్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీ అని, దానిని ఆదివారం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నారని అన్నారు.

కానీ, ప్రజల మనోఫలకాల మీద తమ పేరు ఎప్పటికీ ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముందే జిల్లాకు మంజూరై, రద్దు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.1,070 కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హరీశ్‌రావు.. సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన బహిరంగ లేఖను శనివారం సిద్దిపేటలో విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, పామ్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీకి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణాధారమన్నారు. కాళేశ్వరాన్ని, కూలేశ్వరం అని అంటున్న రేవంత్‌ తన వైఖరి మార్చుకోవాలన్నారు.   

ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు? 
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక సిద్దిపేటలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి రూ.1,170 కోట్లు అర్ధంతరంగా రద్దు చేశారని హరీశ్‌ తెలిపారు. వీటిలో పశువైద్య కళాశాలను రేవంత్‌ కొడంగల్‌కు తీసుకెళ్లారన్నారు. ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా?, ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు వస్తున్నారు? అని ప్రశ్నించారు. కాగా, సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతులకు దాదాపు రూ.300 కోట్ల రుణమాఫీ నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని రైతులకు మూడుసార్లు ఎగ్గొట్టిన దాదాపు రూ.170 కోట్ల రైతుభరోసా డబ్బులు చెల్లించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement