గోదావరి మళ్లీ ఉగ్రరూపం | Godavari River has become violent again | Sakshi
Sakshi News home page

గోదావరి మళ్లీ ఉగ్రరూపం

Aug 29 2025 1:41 AM | Updated on Aug 29 2025 1:44 AM

Godavari River has become violent again

ఉపనదులకూపోటెత్తిన వరద  

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు2 లక్షల క్యూసెక్కుల వరద  

ఎల్లంపల్లికి 6 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  

రేపు మేడిగడ్డ బరాజ్‌కు 9.5లక్షల క్యూసెక్కులకు చేరనున్న వరద 

జైక్వాడ్‌ నుంచి ధవళేశ్వరం బరాజ్‌ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతాల్లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రధాన ఉపనదులైన మంజీర, మానేరు, పెన్‌గంగా, వార్ధా, వెయిన్‌గంగా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరితోపాటు గోదావరి నది ఎగువ, మధ్య, దిగువ పాయలు భీకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టులకు గంటగంటకూ భీకర వరద పోటెత్తడంతో అప్రమత్తత ప్రకటించారు. మహారాష్ట్రలోని జైక్వాడ్‌ ప్రాజెక్టు నుంచి ఏపీలోని ధవళేశ్వరం బరాజ్‌ వరకు పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టుల గేట్లు పైకి ఎత్తారు.  

» భదాచలం వద్ద గోదావరిలో 7.45 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో నీటిమట్టం 38.6 అడుగులకు చేరుకుంది. ప్ర వాహం 9.32 లక్షల క్యూసెక్కులకు చేరితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.  

» మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకు 44,650 క్యూసెక్కుల వరద వస్తుండగా, 18.32 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్‌ గరిష్ట సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 1.81లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 16.14 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 27 గేట్లు పైకెత్తి 2.2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  

» శ్రీరాంసాగర్‌ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 3.2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 67.05 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 39 గేట్లు పైకెత్తి 3.55 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెల 30న శ్రీరాంసాగర్‌కు గరిష్టంగా 3.7లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తనుందని అంచనా వేశారు.

» కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 66,605 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 3.78 టీఎంసీల నిల్వ కొనసాగిస్తూ, 62,407 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టులోకి 5,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో అదేస్థాయిలో రెండుగేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 17,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో మూడుగేట్ల ద్వారా 18,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.  

» దిగువన ఉన్న ఎల్లంపల్లి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 5.14 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 14.63 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 38 గేట్లు పైకెత్తి 5.9 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సోమవారం రాత్రి నాటికి 9 లక్షల క్యూసెక్కులకు వరద పెరుగుతుందని అంచనా వేశారు.  

» కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్‌కు 8.36 లక్షలు, అన్నారం బరాజ్‌కు 6.19 లక్షలు, మేడిగడ్డ బరాజ్‌కు 5.52 లక్షల క్యూసెక్కులతోపాటు సమ్మక్క బరాజ్‌కు 5.13 లక్షలు, సీతమ్మసాగర్‌ బరాజ్‌కు 7.02 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్‌కు శనివారం నాటికి గరిష్టంగా 9.48 లక్షల క్యూసెక్కుల వరద రానుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం మంగళ, బుధవారాల్లో అత్యంత ప్రమాదకర స్థాయికి పెరగనున్నట్టు అంచనా వేస్తున్నారు.  

మిడ్‌మానేరు గేట్లు ఎత్తివేత.. 
భారీ వర్షాలతో మానేరు నది పోటెత్తింది. దీంతో మిడ్‌మానేరు రిజర్వాయర్‌కు మానేరు నుంచి 45,565 క్యూసెక్కులు, శ్రీరాంసాగర్‌ నుంచి ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ ద్వారా మరో 12,000 క్యూసెక్కులు కలిపి మొత్తం 57,566 క్యూసెక్కులు వచ్చి మిడ్‌మానేరులో కలుస్తుండడంతో జలాశయ 17 గేట్లను పైకెత్తి 47,850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ మానేరు జలాశయానికి వరద ప్రవాహం 56,944 క్యూసెక్కులకు పెరిగింది. జలాశయం నిల్వ సామర్థ్యం 24.07 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.97 టీఎంసీలకు నిల్వలు చేరాయి. మంగళవారం ఉదయం నాటికి జలాశయం పూర్తిగా నిండొచ్చు.

సాగర్‌కు పెరిగిన వరద 
26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు 
నాగార్జునసాగర్‌/డిండి: సాగర్‌ జలాశయానికి 3,18,791 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 26 క్రస్ట్‌ గేట్లు, విద్యుదుత్పాదనతో దిగువ కృష్ణానదిలోకి 2,35,058 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో ఆయకట్టుకు నీటి అవసరాలు తగ్గాయి. దీంతో నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. అవసరమైన సమయంలో మళ్లీ నీటిని విడుదల చేయనున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.  

అలుగు పారుతున్న డిండి ప్రాజెక్టు
డిండి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి వరద మరింత పెరిగింది. ఈ నెల 14 నుంచి ప్రాజెక్టు అలుగుపోస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం నుంచి ప్రాజెక్టులోకి 10,202 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో అలుగు నుంచి నీటి విడుదల కూడా పెరిగింది. డిండి ప్రాజెక్టు అందాలను చూడటానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement