అంతర్జాతీయ స్థాయిలో బాలల కథ, కవితల పోటీ 

Ghazal Srinivas Says About Story And Poetry Competition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు కథా, కవితల పోటీని నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 16 ఏళ్ల లోపు వయసున్న తెలుగు పిల్లలందరూ ఈ పోటీకి అర్హులని పేర్కొన్నారు.

కథలు, కవితలు దేశభక్తి, భారత స్వాతంత్య్ర ఉద్యమం, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, భారతదేశ ఘన చరిత్రపై ఉండాలని సూచించారు. స్వీయ రచనలు ఈ పోటీకి మాత్రమే రాసినవై ఉండాలని, వాట్సాప్, వెబ్‌సైట్స్, పత్రికల్లో మరెక్కడా ప్రచురించినవి ఉండకూడదని స్పష్టంచేశారు. కవితలు 20 పంక్తులకు మించి ఉండకూడదని, కథ చేతిరాత 3 పుటలకు మించి ఉండకూడదని, ప్రింటింగ్‌లో  ఏ4 సైజులో మాత్రమే అంటే సింగిల్‌ సైడ్‌ పేజీలో కథ, చేతిరాత బాగాలేని వారు డి.టి.పి కానీ లేదా ఇతరులతో అందంగా రాయించి పంపాలన్నారు.

అలాగే కథ, కవిత పిల్లల సొంతమని తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ హామీ పత్రాన్ని తప్పనిసరిగా జతచేయాలని పేర్కొన్నారు. విద్యార్థి పేరు, తరగతి, ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం, సెల్‌ఫోన్‌ నంబర్‌ ఉండాలని, పోస్ట్‌ ద్వారా గానీ మెయిల్‌ ద్వారా గానీ కథలు, కవితలను.. ఆవుల చక్రపాణి యాదవ్,  తెలుగు, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉర్దూ, గడియారం హాస్పిటల్‌ పక్కన కర్నూలు–518001 అనే చిరునామాకు ఆగస్టు 8 లోపు పంపాలన్నారు.

మరిన్ని వివరాలకు 9963350973 ఫోన్‌నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. ప్రథమ బహుమతి కింద రూ.5,000, ద్వితీయ బహుమతి రూ.3,000, తృతీయ బహుమతి రూ.2,000.. మూడు ప్రోత్సాహ బహుమతులు ఒక్కొక్కరికి రూ.వేయి చొప్పున అందిస్తామని గజల్‌ శ్రీనివాస్‌ ప్రకటించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top