Ganesh: జజ్జనకరి జనారే.. నిమజ్జన హుషారే

Ganesh Nimajjanam In Hyderabad - Sakshi

సాగరం సన్నద్ధమైంది. గణనాథుడికి  ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి కొద్ది సేపట్లో  ప్రారంభం కానున్న మహా ‘గణ’ ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి. గతేడాది కోవిడ్‌ కారణంగా దేవదేవుడికి సాదాసీదాగా పూజలు చేసిన భక్తజనం ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించింది. నగరమంతటా వేలాది విగ్రహాలను ప్రతిష్టించారు. ఇష్టదైవాన్ని ఆనందోత్సాహాలతో కొలిచి మొక్కారు. ‘కరోనా వంటి మహమ్మారులు మరోసారి ప్రబలకుండా మమ్మల్ని కాపాడవయ్యా బొజ్జ గణపయ్యా’ అంటూ  భక్తులు వేడుకున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేయనుంది.  

  

మహాగణపతి క్రేన్‌ నంబర్‌–4
ఖైరతాబాద్‌ శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి నిమజ్జనం క్రేన్‌ నంబర్‌–4 వద్ద జరిగేలా ఏర్పాట్లు చేశారు.   
► 2.5 కి.మీ. మేర సాగే ఖైరతాబాద్‌ వినాయక నిమజ్జన ప్రక్రియ మొత్తం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోగా పూర్తి చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 
► బెంగళూరు నుంచి ప్రత్యేక భారీ వాహనాన్ని తీసుకొచ్చారు.  
 ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్‌ మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది.  
 11 గంటల మధ్య ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నెం.4 వద్దకు చేరుకోగానే 12 గంటల నుంచి 1 గంట మధ్య నిమజ్జనం పూర్తి చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.  

రూట్‌ మ్యాప్‌ ఇలా... 

మహాగణపతి మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమై సెన్షేషన్‌ థియేటర్, రాజ్‌ దూత్‌ చౌరస్తా మీదుగా టెలిఫోన్‌ భవన్, ఎక్బాల్‌ మినార్, తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ గుండా క్రేన్‌ నెం.4 వద్దకు చేరుకుంటుంది. 

బాలాపూర్‌ గణేష్‌ ఎటు వైపు నుంచి? 
బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు 17 కి.మీ. గణేష్‌ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మార్గంలోని ఫలక్‌నుమా బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. శనివారం రాత్రి వరకు కొంత పూర్తయ్యే అవకాశం ఉందని..రాత్రి సమయంలో ట్రయల్‌ రన్‌ వేసి..సజావుగా సాగితే బాలాపూర్‌ గణేష్‌తో పాటు 15 అడుగులకు మించిన మూడు నాలుగు విగ్రహాలను కూడా ఇదే బ్రిడ్జి మీదుగా అనుమతిస్తామని సీపీ తెలిపారు. ట్రయల్‌ రన్‌లో విఫలమైతే కందికల్‌ గేట్‌ నుంచి లాల్‌దర్వాజా మీదుగా సాగర్‌ వైపు మళ్లిస్తామని చెప్పారు. 

► కేశవగిరి నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు విగ్రహాలు పాత చాంద్రాయణగుట్ట పీఎస్‌– చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్‌– నల్లవాగు–కందికల్‌గేట్‌ ఫ్లైఓవర్‌– ఓపీ ఛత్రినాక– లాల్‌దర్వాజాగుడి–నాగుల్‌చింత–చార్మినార్‌–మదీనా–అఫ్జల్‌గంజ్‌– ఎస్‌బజార్‌–ఎంజేమార్కెట్‌– అబిడ్స్‌–బషీర్‌బాగ్‌–లిబర్టీ–అంబేద్కర్‌ విగ్రహం నుంచి ఎన్‌టీఆర్‌ మార్గ్, (నెక్లెస్‌ రోడ్‌) లేదా ఎగువ ట్యాంక్‌బండ్‌ వెళ్తాయి. 
► సికింద్రాబాద్‌ మీదుగా వచ్చే ఊరేగింపు విగ్రహాలు ఆర్పీ రోడ్‌ నుంచి ఎంజీ రోడ్‌–కర్బాలా మైదాన్‌– కవాడిగూడ– ముషీరాబాద్‌ క్రాస్‌ రోడ్‌– ఆర్టీసీ క్రాస్‌రోడ్‌– నారాయణగూడ క్రాస్‌ రోడ్‌– హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ నుంచి లిబర్టీలో ప్రధాన మార్గంలో కలవాలి. 
► చిలకలగూడ క్రాస్‌రోడ్‌ నుంచి వచ్చే వాహనాలు గాంధీ ఆసుపత్రి మీదుగా ముషీరాబాద్‌ క్రాస్‌ రోడ్‌లో కలవాలి. 
► ఉప్పల్‌ నుంచి వాహనాలు రామంతాపూర్‌– 6 నంబర్‌ జంక్షన్‌ అంబర్‌పేట– శివంరోడ్‌– ఎన్‌సీసీ– దుర్గాభాయి దేశ్‌ముఖ్‌ ఆసుపత్రి– హింది మహావిద్యాలయ్‌ క్రాస్‌రోడ్‌– ఫీవర్‌ ఆసుపత్రి– బర్కత్‌పుర క్రాస్‌ రోడ్‌– నారాయణగూడ క్రాస్‌రోడ్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ నుంచి వచ్చే మార్గంలో కలవాలి. 
► దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాలు ఐఎస్‌ సదన్‌– సైదాబాద్‌– చంచల్‌గూడ నుంచి ముసారాంబాగ్‌ మీదుగా అంబర్‌పేట మార్గంలో కలవాలి. 
 తార్నాక నుంచి వచ్చే విగ్రహాలు ఓయూ దూరవిద్యా కేంద్ర రోడ్‌ నుంచి అడిక్‌మెట్‌ నుంచి విద్యానగర్‌ మీదుగా ఫీవర్‌ ఆసుపత్రి మార్గంలో కలవాలి. 
► టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు మాసబ్‌ట్యాంక్‌ మీదుగా అయోధ్య జంక్షన్‌– నిరంకారీ భవన్‌– పాత సైఫాబాద్‌ పీఎస్‌– ఇక్బాల్‌ మినార్‌ నుంచి ఎన్‌టీఆర్‌ మార్గ్‌ వైపు మళ్లాలి. 
► ఎర్రగడ్డ నుంచి వచ్చే వాహనాలు ఎస్‌ఆర్‌నగర్‌– అమీర్‌పేట–పంజగుట్ట–వీవీ విగ్రహం నుంచి మెహదీపట్నం మీదుగా నిరంకారీ భవన్‌ వైపు మళ్లాలి. 
► టపాచబుత్ర, ఆసిఫ్‌నగర్‌ మీదుగా వచ్చే వాహనాలు సీతారాంబాగ్‌– బోయిగూడ కమాన్‌– వౌల్గా హోటల్‌– గోషామహల్‌ బారాదరి– అలాస్కా మీదుగా ఎంజే మార్కెట్‌ ప్రధాన మార్గంలో కలవాలి. ఇక్కడ్నుంచి అబిడ్స్‌ మీదుగా బషీరాబాగ్‌–లిబర్టీ– అంబేద్కర్‌ విగ్రహం– ఎన్‌టీఆర్‌ మార్గ్‌– పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ మీదుగా ఎగువ 

ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాలి
► సుమారు 27 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. హోంగార్డ్‌లు, స్పెషల్‌ ఆఫీసర్స్, ఫారెస్ట్, ఎక్సైజ్, ఎస్‌పీఎఫ్, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ పోలీసులు ఉన్నారు.  
► సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు, జంక్షన్లలో వజ్ర వాహనాలను, గ్యాస్‌ ఎస్కార్ట్, వాటర్‌ వెహికిల్స్, అగ్నిమాపక వాహనాలను సిద్ధం చేశారు. 19 సైబర్‌ ట్యాచ్‌ టీమ్, బాంబ్‌ డిస్పోజ్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. 24 స్నిపర్‌ డాగ్స్‌ కూడా బందోబస్త్‌లో పాల్గొంటున్నాయి. 

 రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్లు, సాపింగ్‌ మాల్స్, సినిమా హాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. వేగవంతమైన కమ్యూనికేషన్‌ కోసం ఇప్పటికే పోలీసులు వద్ద ఉన్న 2,700 వైర్‌లెస్‌ సెట్స్‌తో పాటు అదనంగా 475 సెట్లను అందించారు. 
► హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఇరిగేషన్, మెట్రో, ట్రాన్స్‌పోర్ట్‌ విభాగాలలతో కూడిన జాయింట్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు అన్ని శాఖల అధికారులు పర్యవేక్షిస్తుంటారు. 
► సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తి కనుగుణంగా  చెరువులు, కొలనులు కలుషితంకాకుండా విగ్రహాలు వేసిన వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు. 
► హుస్సేన్‌సాగర్‌ ప్రాంతంలో కోవిడ్‌ నిరోధక ఉచిత వ్యాక్సినేషన్‌ శిబిరం.
సోమవారం 

ఉదయం లోపే పూర్తి.. 
గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అవసరమైన మేర పోలీసు బలగాలు విధుల్లో ఉంటాయి. మూడు కమిషనరేట్లతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి విగ్రహాలు తరలివస్తాయి. సుమా రు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నాం. సోమ వారం ఉదయం 5:30 వరకు నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 

– అంజనీ కుమార్, హైదరాబాద్‌ సీపీ

కోవిడ్‌ నిబంధనలు పాటించాలి 
వినాయక నిమజ్జనం చూసేందుకు తరలివచ్చే భక్తులు, నిర్వాహకులు అందరూ కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలి. నిమజ్జనానికి వచ్చే మార్గాలలో ఎలాంటి వాహనాలు, నిర్మాణ సామగ్రి వంటివి నిలిపి ట్రాఫిక్‌ జామ్‌లకు గురిచేయకూడదు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ప్రజలు సహకరించాలి. 

– మహేశ్‌ ఎం. భగవత్, సీపీ, రాచకొండ  

వదంతుల్ని ఫార్వర్డ్‌ చేయొద్దు 
భక్తులు తమ పిల్లల్ని, వెంట తెచ్చుకునే వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి వదంతుల్ని నమ్మొద్దు. వాట్సాప్‌ గ్రూప్‌లకు అనవసర మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేయొద్దు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే డయల్‌ 100కు గానీ 94906 17444 వాట్సాప్‌లో గానీ ఫిర్యాదు చేయాలి. మహిళలపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 94936 22395 నంబరులో ఫిర్యాదు చేయాలి.     

– స్టీఫెన్‌ రవీంద్ర, సీపీ, సైబరాబాద్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top