Hyderabad: 9న గణేష్‌ నిమజ్జనం.. ఉచితంగా 6 లక్షల విగ్రహాల పంపిణీ

Ganesh Nimajjanam 2022 Hyderabad Date Announced, Clay Idols Free Distribution - Sakshi

సుమారు 50 చోట్ల పాండ్‌ల నిర్మాణం

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 31న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, వచ్చే నెల సెప్టెంబరు 9న గణేష్‌ నిమజ్జనం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పీసీబీ ఆధ్వర్యంలో లక్ష, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం 6 లక్షల గణేష్‌ విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 


ఖైరతాబాద్‌ గణేష్‌ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 24న అధికారులతో కలిసి ఖైరతాబాద్‌ గణేష్‌ మండపాన్ని సందర్శిస్తామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 25 పాండ్‌లకు అదనంగా మరో 50 పాండ్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహాల ఊరేగింపు రహదారుల్లో అవసరమైన చోట్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సెప్టెంబరు 9న నిర్వహించే గణేష్‌ నిమజ్జనానికి సుమారు 8 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది మూడు షిఫ్ట్‌ల్లో విధుల్లో ఉంటారని చెప్పారు. గణేష్‌ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలన్నారు. (క్లిక్: కోట్ల గొంతుకలు.. ఒక్క స్వరమై)


సమావేశంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, విద్యుత్‌ శాఖచీఫ్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రవిగుప్తా, అదనపు డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, పీసీసీబీ మెంబర్‌ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్, పోలీస్‌ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్‌ భగవత్, స్టీఫెన్‌ రవీంద్ర, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్, కలెక్టర్‌ అమయ్‌ కుమార్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ అధికారి రఘోత్తంరెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు భగవంతరావు, రాఘవరెడ్డి,  ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ప్రతినిధి సుదర్శన్, సికింద్రాబాద్, గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: సందడిగా మెగా రికార్డ్స్‌ అవార్డుల ప్రదానోత్సవం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top