Gandhi Hospital: గాంధీలో ‘ఫంగస్‌’ సర్జరీలు

Fungus Surgery In Gandhi Hospital Successfully - Sakshi

ఐదుగురికి విజయవంతంగా నిర్వహించిన వైద్యులు

సోమవారం కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి మరో 358 మంది బాధితులు

 బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో బాధపడుతూ పలుచోట్ల ముగ్గురు మృతి

సాక్షి, నెట్‌వర్క్‌/ హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు చేపట్టిన శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం 123 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో రోజూ 10 బ్లాక్‌ఫంగస్‌ సర్జరీలు చేసేందుకు మౌలిక వసతులు సమకూరినట్లు సర్జరీ కమిటీ చైర్మన్, ఈఎన్‌టీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ శోభన్‌బాబు పేర్కొన్నారు. బ్లాక్‌ఫంగస్‌ అంటువ్యాధి కాదని, స్టెరాయిడ్స్‌ ఎక్కువ వినియోగించినవారికి, మధుమేహ బాధితులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. బాధితులందరికీ సర్జరీలు అవసరం లేదని మందులతో నయం కాకుంటే సర్జరీ చేస్తామని వివరించారు. శస్త్రచికిత్సలు చేసిన ఐదుగురిలో ఇన్‌ఫెక్షన్‌ సోకిన భాగాలను తొలగించామని, ఫంగస్‌ వ్యాప్తి నిలిచిపోయిన తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో ఆయా కృత్రిమ భాగాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.  

రోజురోజుకు పెరుగుతున్న కేసులు
రాష్ట్రంలో రోజురోజుకూ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బ్లాక్‌ ఫంగస్‌ నోడల్‌ ఆస్పత్రి అయిన హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి సోమవారం ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలతో  దాదాపు 358 మంది వచ్చారు. వారిని పరీక్షించిన వైద్యులు 31 మందినే చేర్చుకున్నారు. మిగతా వారికి ఆస్పత్రి ఆవరణే దిక్కయింది. ఈ ఆస్పత్రిలో 230 బెడ్స్‌ మాత్రమే ఉన్నాయి. అందులో ఇప్పటికే 218 మంది చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. పదుల సంఖ్యలో మాత్రమే డిశ్చార్జి అవుతుండటం.. కేసులు మాత్రం వందల సంఖ్యల్లో వస్తుండటం ఈఎన్‌టీ వైద్యులకు తలనొప్పిగా మారింది. ప్రతి జిల్లాలో ఒక బ్లాక్‌ ఫంగస్‌ నోడల్‌ కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అయిలాపూర్‌ రోడ్డులో ఉండే 45 ఏళ్ల మహిళకు బ్లాక్‌ఫంగస్‌ నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడి, తగ్గాక కళ్లు ఎర్రబడి, వాపు రావడంతో స్థానిక వైద్యులను సంప్రదించగా, హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా, బ్లాక్‌ ఫంగస్‌ అని తేలగా, చికిత్స అందిస్తున్నారు. కాగా, నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన బోడ వెంకటేశ్వర్లుకు కరోనా సోకి కోలుకున్న తర్వాత తీవ్ర జ్వరం వచి్చంది. దీంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, బ్లాక్‌ఫంగస్‌ సోకినట్లు నిర్ధారించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి.. 
బ్లాక్‌ ఫంగస్‌ సోకడంతో రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన వసంత్‌కుమార్‌ (42) మృతి చెందాడు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయాడు. నిర్మల్‌ జిల్లా భైంసాలోని రాహుల్‌నగర్‌లో నివాసముంటున్న గజ్జన్‌బాయి (63) బ్లాక్‌ ఫంగస్‌తో మృతి చెందింది. నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోగా, నయం కాదని చెప్పడంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లగా, సోమవారం మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామానికి చెందిన తూలగుంట్ల సులోచన (57) బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో బాధపడుతూ సోమవారం మృతి చెందింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top