డీలర్లకు ఓటీపీ.. లబ్ధిదారులకు టోపీ 

Fraud In Ration Rice Shop In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు సరఫరా చేస్తున్న రాయితీ బియ్యం పక్కదారి పడుతోంది. పేదల అవగాహనాలేమిని డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. లబ్ధిదారుల నుంచి ఓటీపీని తీసుకొని అరకొర బియ్యం పంపిణీ చేసి, మిగతా బియ్యాన్ని అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఓటీపీ నంబర్‌ను సేకరించి డీలర్లు చేస్తున్న దోపిడీపై రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’జరిపిన పరిశీలనలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రేషన్‌షాపులున్నాయి. ఇందులో 2.85 కోట్లమంది లబ్ధిదారులు ఉన్నారు. కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నాయి. ప్రతినెలా 1.78 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం రాష్ట్రానికి సçరఫరా అవుతోంది. రేషన్‌ డీలర్లు ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15 లేదా 20వ తేదీ వరకు సరకులనున లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. సరుకుల పంపిణీ వేళ రేషన్‌లబ్ధిదారుడు నుంచి ఓటీపీ లేదా ఐరిస్‌ తీసుకొని సరుకులు ఇస్తారు.  

బియ్యం కాజేసేది ఇలా...!  
ఒక రేషన్‌ లబ్ధిదారుడి ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే ఆ కుటుంబానికి 40 కిలోల బియ్యం పంపిణీ చేస్తారు. నిర్దేశిత సమయాల్లో రేషన్‌çషాపు వద్ద భారీగా లబ్ధిదారులు ఉంటే, అక్కడ వేచి చూసే ఓపికలేని లబ్ధిదారులు ఆ షాపు డీలర్‌కు ఫోన్‌ చేసి తమ రేషన్‌కార్డు నంబర్‌ చెబుతారు. మిషిన్‌లో సదరు నంబర్‌ను సంబంధిత డీలర్‌ ఎంటర్‌ చేయగానే లబ్ధిదారుల ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిందంటే ఆ లబ్ధిదారు సరుకులు తీసుకున్నట్లు లెక్క.

ఆ తర్వాత డీలర్లు సూచించిన తేదీకి బియ్యం కోసం వెళ్తే కోటా అయిపోయిందని చెబుతున్నారు. లేదంటే, ‘ఇప్పుడు కొన్ని తీసుకెళ్లు.. మిగతావి తర్వాత కొన్ని ఇస్తాను’అని తిప్పి పంపుతున్నారు. ఇలా 15 తేదీ నుంచి 20 వరకు జాప్యం చేసి, తీరా ఆ నెల కోటా అయిపోయిందని చెప్పేస్తున్నారు. ఇలా కనీసం 5 లేక 10 కిలోలను లబ్ధిదారుల నుంచి డీలర్లు కాజేస్తున్నారు.  

కార్డుపోతుందనే భయంతోనే.. 
కొందరు లబ్ధిదారులు ప్రతినెలా రేషన్‌ తీసుకోరు. మరికొందరేమో రేషన్‌ బియ్యం ఎందుకులే అని తీసుకోవడంలేదు. రేషన్‌కార్డు ఉంటే చాలు అని ఇలాంటి వాళ్లు భావిస్తుంటారు. ప్రతినెలా ఆయా రేషన్‌ డీలర్లకు ఓటీపీ చెప్పి వదిలేస్తున్నారు. రేషన్‌డీలర్లు ఇలా కాజేసిన బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. టిఫిన్‌ సెంటర్లకు, బియ్యం వ్యాపారులకు కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. 

సన్నబియ్యం రావడమే కారణం 
ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి రేషన్‌డీలర్లకు సన్న, దొడ్డు రకం బియ్యం సరఫరా చేస్తోంది. అయితే రేషన్‌ డీలర్లు ఒక్కో సంచిని పరిశీలించి సన్నబియ్యం బస్తాలను పక్కకు పెట్టేస్తున్నారు. సంబంధిత షాపునకు మొత్తంగా సన్నబియ్యం వస్తే అందులోంచి దాదాపు 20 శాతం మందికి కొంత కోటా ఆపి మిగతా బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అలా ఆపిన బియ్యాన్ని డీలర్లు ఇతరులకు అమ్ముకుంటున్నారు. 

చదవండి: జూబ్లీహిల్స్‌: ఫుడ్‌కోర్ట్‌ టాయిలెట్‌లో సెల్‌ఫోన్‌ పెట్టి.. వీడియోలు రికార్డింగ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top