మిస్టర్‌ రేవంత్‌.. రోజులు లెక్కపెట్టుకో | Former Minister Harish Rao responded strongly to Revanth Reddy comments | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ రేవంత్‌.. రోజులు లెక్కపెట్టుకో

Jun 29 2026 3:37 AM | Updated on Jun 29 2026 3:37 AM

Former Minister Harish Rao responded strongly to Revanth Reddy comments

నా ఎత్తు, పొడవుతో నీకేం పని? 

దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి రా.. తేల్చుకుందాం  

సింగరేణి టెండర్‌ బాగోతాలపై చర్చకు సిద్ధమా? 

నల్లగొండ సభలో సీఎం రేవంత్‌వి అన్ని అబద్ధాలే: హరీశ్‌రావు ఫైర్‌   

సిద్దిపేటజోన్‌: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ అంటే భయం పట్టుకుంది. నిద్రలో కూడా వణుకు మొదలైంది. ఆయన చెప్పకనే చెబుతున్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాబోతుంది. ఆయన తప్పులు చేశారు. ప్రజలంతా బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు అని అర్థమైంది. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మిస్టర్‌ రేవంత్‌రెడ్డి.. రోజులు లెక్కపెట్టుకో..ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు’అని మాజీమంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. నల్లగొండ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆదివారం సిద్దిపేటజిల్లా కేంద్రంలో బూత్‌ లెవల్‌ ఏజెంట్ల సమావేశంలో హరీశ్‌రావు స్పందించారు. 

కర్ణాటకలో ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశ మతలబు గురించి అడిగితే దానికి బదులు ఇవ్వకుండా, సీఎం రేవంత్‌రెడ్డి నల్లగొండ సభలో నా పొడవు, ఎత్తు గురించి మాట్లాడి తప్పించుకోవాలని చూస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులు ముంచి ముంపుమేస్త్రీగా మారొద్దని ప్రశ్నిస్తే బదులు లేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి మనస్సు, ఆలోచన, బుద్ధి అంతా పొట్టిదేనని ఎద్దేవా చేశారు. 2034 వరకు అధికారంలోనే ఉంటామని మాట్లాడిన రేవంత్‌రెడ్డికి నిజంగా నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేయాలని, ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. లేకుంటే పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల్లోకి పోదామని, దమ్మూధైర్యం ఉంటే తన సవాల్‌ స్వీకరించాలన్నారు. 

రైతుభరోసా ద్వారా రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నా అని అంటున్న సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రైతు భరోసా, రైతుబీమాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. రైతుల కళ్లల్లో కన్నీళ్లు వచ్చేలా చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ముందు తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎల్‌బీ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో 12 మీటర్లు కూడా తవ్వలేదని, అన్యాయంగా ఎనిమిది మంది అమాయక కార్మికులు చనిపోతే వారి శవాలను కూడా తీయలేని అసమర్థ ప్రభుత్వం అని విమర్శించారు. సింగరేణి అవినీతి బహిర్గతం చేస్తే అసలు టెండర్లు కాలేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

సృజన్‌రెడ్డికి టెండర్లు దక్కింది రుజువు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్‌ విసిరారు. కాళేశ్వరం కూలింది అని ఆరోపణలు చేసిన సీఎం ఇప్పుడు హైదరాబాద్‌ తాగునీరు, మూసీకి ఎక్కడి నీళ్లు తరలిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్రపై సీఎం వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వరకు వెళ్తూ తుపాకీ గురి పెట్టిన రేవంత్‌రెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందేనన్నారు. తెలంగాణ ఉద్యమం, త్యాగం గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారని చెప్పారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement