
రాష్ట్ర వాటాల విషయంలో రాజీపడం: మంత్రి ఉత్తమ్
స్థానిక ఎన్నికల తర్వాత నీటి వినియోగ సంఘాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఎగువ కృష్ణా నదిపై కర్ణాటకలో నిర్మించిన ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో బలంగా పోరాడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుసేన్, సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్‌తో మంత్రి సోమవారం జలసౌధలో సమీక్ష నిర్వహించారు.
తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం కోసం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు సవరణ డీపీఆర్ రూపకల్పనను వేగిరం చేయాలన్నారు. మంత్రివర్గ సమావేశంలో తీర్మానించిన వెంటనే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం నిర్మాణ పనులు పునరుద్ధరించాలని ఆదేశించారు. కల్వకుర్తి, దేవాదుల ప్యాకేజీ–6 పనుల సవరణ అంచనాలతోపాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, ఖమ్మంలోని నీటిపారుదల శాఖ భూములకు సంబంధించిన ఫైళ్లను మంత్రివర్గ సమావేశం ముందు పెట్టేందుకు సిద్ధం చేయాలని చెప్పారు.
‘కేటీఆర్ ఆల్మట్టి ప్రాజెక్టుపై పిచ్చిగా మాట్లాడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచొద్దని సుప్రీంకోర్టు స్టే అమల్లో ఉంది’ అని ఉత్తమ్ అన్నారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను నియమించామని చెప్పారు.
త్వరలో నీటి వినియోగ సంఘాలు
క్రమపద్ధతిలో చెరువులు, కాల్వల నిర్వహణ కోసం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నీటి వినియోగ సంఘాలను ఏర్పాటు చేయనున్నామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. తొలుత చెరువుల నిర్వహణకు వీటిని ఏర్పాటు చేసి క్రమంగా భారీ ప్రాజెక్టులకు విస్తరింపజేస్తామన్నారు. ప్రతి సంఘానికి సహాయకుడిగా లస్కర్‌తోపాటు కన్వీనర్‌గా నీటిపారుదల శాఖ అధికారిని నియమిస్తామన్నారు.
జవాబుదారీతనంతో ముందస్తు చర్యలు తీసుకునే యంత్రాంగం ఉండి ఉంటే చాలా చెరువులకు గండ్లతో పాటు ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యాలను నిలువరించగలిగేవారమని ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో గుర్తించామన్నారు. నీటి వినియోగ సంఘాలతో ఈ కొరతను తీర్చడంతో పాటు సాగునీటి వనరుల నిర్వహణ బాధ్యతల్లో స్థానికులకు చోటు కల్పించనున్నాయన్నారు.
రైతులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి, సభ్యులను సంప్రదించి సంఘాలను నియమించాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. చెరువులు మరమ్మతులకు నోచుకోకపోవడంతో వర్షాకాలంలో వాటికి గండ్లుపడి రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని రైతు కమిషన్ చెప్పిందన్నారు. ఇందుకోసం నీటి వినియోగ సంఘాలను ఏర్పాటు చేసి లస్కర్లతోపాటు ఇతర వనరులను కల్పించాలని విజ్ఞప్తి చేసిందన్నారు.
చెరువులు, కాల్వలను పటిష్టంగా ఉంచడంలో రైతులకు నీటి వినియోగ సంఘాలు భరోసా కల్పిస్తాయని ఉత్తమ్ అన్నారు. కొత్త విధానంతో క్షేత్రస్థాయిలో బాధ్యతల పునరుద్ధరణతోపాటు గండ్లుపడకముందే నివారణ చర్యలు సాధ్యమవుతాయన్నారు. సాగునీటి వనరులకు తొలి రక్షణ కవచంగా సంఘాలు వ్యవహరిస్తూ అత్యవసర మరమ్మతుల అవసరం లేకుండా చర్యలు తీసుకుని పంటలను కాపాడతాయన్నారు.