సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు తుమ్మల, పొన్నం
నర్మెటలో నిధుల విడుదల కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం రేవంత్
ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంబోత్సవ వేదిక నుంచి...
తొలి విడతలో రూ. 3,590 కోట్లు
ప్రతిపక్ష నేతలవి చిల్లర మాటలు: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్/సాక్షి, సిద్దిపేట: రైతుభరోసా పథకం కింద యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో కొత్తగా నిర్మించిన ఆయిల్‌పామ్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి హాజరయ్యే సీఎం అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి రైతుభరోసాను ప్రారంభించనున్నారు. మొదటి విడత కింద రూ. 3,590 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. తద్వారా ఎకరం లోపు విస్తీర్ణం భూములున్న సుమారు 73 లక్షల మంది రైతులకు డబ్బులు అందనున్నాయి.
ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఈ సీజన్‌కు సంబంధించి ఎకరాకు రూ.6 వేలు చొప్పున రాష్ట్రంలోని సుమారు 150 లక్షల ఎకరాల భూములకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించనుంది. రెండవ విడతగా 20 రోజుల తరువాత రూ. 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరు నాటికి మిగతా మొత్తాన్ని చెల్లించనుంది. నర్మెట ఆయిల్‌పామ్ పరిశ్రమ ప్రారంబోత్సవానికి వ్యవసాయ, అనుబంధ శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్ నర్మెటలోనే ఉంటూ సీఎం పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.
కాళేశ్వరంతో సాగు కావట్లేదు: తుమ్మల
‘ప్రతిపక్ష నేతలవి చిల్లర మాటలే.. కాళేశ్వరం జలాలతో పామాయిల్ సాగు కావడంలేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచి్చన తర్వాతే సిద్దిపేట జిల్లా నర్మెటలో దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మించాం. ఫ్యాక్టరీని 16 నెలల్లోనే పూర్తి చేశాం’అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గం అని వివక్ష చూపకుండా, సిద్దిపేట భౌగోళిక ప్రాధాన్యతను గుర్తించి మొదటి ప్రాధాన్యతగా ఇక్కడే ఫ్యాక్టరీ మంజూరు చేశానని వివరించారు. కాళేశ్వరంతో పామాయిల్ సాగు కావడం లేదని, వాతావరణం అనుకూలంతో రాష్ట్రమంతా ఆయిల్‌పామ్ సాగవుతుందని తెలుసుకోవాలన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తే అది రైతుల వడ్డీకే సరిపోయిందని, ఇంకా ఒక్కో రైతుపై రూ.12 వేలు వడ్డీ మీద పడిందన్నారు. ప్రతిపక్ష నేతలు కేవలం రైతులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ప్రారంభాలు.. శంకుస్థాపనలు
సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే జిల్లా జైలు, ఆయుష్ ఆస్పత్రి, సెంట్రల్ డ్రగ్ స్టోర్, పీహెచ్‌సీలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్, కొండపాకలో యంగ్ ఇండియా స్కూల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 30 వేల మంది రైతులతో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. నాలుగు రోజులుగా జరుగుతున్న రైతు ఉత్సవాలు సీఎం సభతో ముగియనున్నాయి.


