
గోదావరి జలాశయాలు నిండేదెప్పుడు?
ఎగువ నదిలో ఎట్టకేలకు వరద ఉధృతి..
ఒడిసి పట్టుకోవడంలో మీనమేషాలు!
వృథాగా సముద్రంలో కలిసిపోతున్న జలాలు
ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకే నీటి పంపింగ్
అక్కడి నుంచి రంగనాయక, మల్లన్న, కొండపోచమ్మలకు ప్రారంభం కాని ఎత్తిపోతలు
మలకపేట, అప్పర్ మానేరుకూ మొదలవ్వని పంపింగ్ ప్రక్రియ
గోదావరి పరీవాహకంలో మొత్తం 57 జలాశయాలు
మొత్తం 419.81 టీఎంసీల సామర్థ్యానికి గాను కేవలం 191.69 టీఎంసీలే నిల్వ
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభమై రెండున్నర నెలల తర్వాత ఎట్టకేలకు ఎగువ గోదావరి వరదెత్తింది. నదీ పరీవాహకంలో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహకంలోని జలాశయాలన్నీ అడుగంటిపోయి ఉండగా, ఎప్పటికప్పుడు పంపుల ద్వారా ఎత్తిపోసి నిల్వ చేసుకోకపోవడంతో వరద జలాలన్నీ వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. జలాల ఎత్తిపోతలో మీనమేషాలు లెక్కిస్తున్న అధికార యంత్రాంగం.. ఎల్లంపల్లి జలాశయం నుంచి మేడారం, అక్కడి నుంచి మిడ్‌మానేరు జలాశయానికి పంపింగ్‌ను మాత్రమే ప్రారంభించడం గమనార్హం.
మిడ్ మానేరుకు తరలింపులో తీవ్ర ఆలస్యం
మిడ్‌మానేరు నుంచి ఎగువన ఉన్న అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ జలాశయాల్లోకి నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. వాస్తవానికి శ్రీరామ్‌సాగర్‌కు గత మూడు రోజులుగా భారీ వరద వస్తున్నా ఫ్లడ్ ఫ్లో కెనాల్ (ఎఫ్‌ఎఫ్‌సీ) ద్వారా గ్రావిటీతో మిడ్‌మానేరు జలాశయానికి నీళ్లను తరలించడంలో తీవ్ర ఆలస్యం జరిగింది. ఆదివారం సాయంత్రం ఎల్‌ఎఫ్‌సీ ద్వారా 10,000 క్యూసెక్కులను విడుదల చేయగా, ఇంకా ఆ నీళ్లు మిడ్‌మానేరుకు చేరుకోలేదు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది పంప్‌హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్‌లోకి, అక్కడి నుంచి గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా అంతే నీళ్లను మిడ్‌మానేరు జలాశయంలోకి ఎత్తిపోస్తున్నారు. నంది, గాయత్రి పంప్‌హౌస్‌లలో చెరో ఏడు చొప్పున మొత్తం 14 పంపులుండగా, చెరో 4 పంపులతో నీళ్లను పంపింగ్ చేస్తున్నారు. దీంతో మిడ్‌మానేరు జలాశయం నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలకు గాను 11.13 టీఎంసీలకు చేరింది.
మిడ్ మానేరు నుంచి ఎప్పుడు?
మిడ్‌మానేరు నుంచి నీళ్లను ఏకకాలంలో సమాంతరంగా అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌తో పాటు మరో లింక్ ద్వారా మలకపేట, అప్పర్ మానేరుకు ఎత్తిపోసేందుకు వీలుండగా, ఇంకా ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఈ ఆన్‌లైన్ రిజర్వాయర్లలో ప్రస్తుతం నిల్వలు అడుగంటిపోయి ఉన్నా పంపింగ్ ప్రారంభించకపోవడం గమనార్హం.
ప్రాజెక్టులకు వరద ఇలా..
రాష్ట్రంలో మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం 6 గంటలకు 31,412 క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 28,357 క్యూసెక్కులకు తగ్గిపోయింది. జలాశయం నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20.37 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 43,244 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు.
దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 49,000 క్యూసెక్కుల వరద వస్తుండడంతో ప్రస్తుతం నిల్వలు 12.88 టీఎంసీలకు చేరాయి. ఇక గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరామ్‌సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 1.51 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 66.23 టీఎంసీలకు పెరిగాయి. మరో రెండురోజుల్లో శ్రీరామ్‌సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
అప్పుడే కడెం, ఎల్లంపల్లి గేట్లు కిందకి..
కడెం నదిపై ఉన్న కడెం ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రవాహం శనివారంతో పోల్చితే ఆదివారానికి 1.33 లక్షల క్యూసెక్కుల నుంచి 4,632 క్యూసెక్కులకు తగ్గిపోవడంతో గేట్లను కిందికి దించేశారు. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.17 టీఎంసీల నిల్వలను కొనసాస్తూ 299 క్యూసెక్కులను కాల్వకు విడుదల చేస్తున్నారు.
శ్రీరామ్‌సాగర్, కడెంకి దిగువన గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చే వరద సైతం 2.15 లక్షల క్యూసెక్కుల నుంచి 28,460 క్యూసెక్కులకు పడిపోవడంతో గేట్లను మూసివేశారు. జలాశయం నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 18.31 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తున్నారు.
అక్కడి నుంచి గాయత్రి పంప్‌హౌస్ ద్వారా 9,390 క్యూసెక్కులను మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. మిడ్‌మానేరు నుంచి నీళ్లను ఎత్తిపోస్తే అనంతగిరి రిజర్వాయర్ కింద 40వేల ఎకరాలు, రంగానాయకసాగర్ కింద 1.10 లక్షల ఎకరాలు, మల్లన్నసాగర్ కింద 2.96 లక్షల ఎకరాలు, కొండపోచమ్మసాగర్ కింద 2.85 లక్షల ఎకరాలు, అప్పర్ మానేరు కింద 16,085 ఎకరాలకు ప్రస్తుత ఖరీఫ్‌లో సాగునీరు అందే అవకాశం ఉంది.
కృష్ణా జలాశయాలు కళ కళ
కృష్ణా పరీవాహకంలో రాష్ట్రంలో మొత్తం 649.53 టీఎంసీల సామర్థ్యంతో 30 రిజర్వాయర్లుండగా, 584.65 టీఎంసీల నిల్వలతో అన్నీ జలకళను సంతరించుకున్నాయి. కానీ గోదావరి పరీవాహకంలో మొత్తం 419.81 టీఎంసీల సామర్థ్యంతో 57 జలాశయాలుండగా, కేవలం 191.69 టీఎంసీల నిల్వలతో వెలవెలబోతుండటం గమనార్హం.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీళ్లను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో 33.18 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని రాష్ట్రం తాత్కాలికంగా కోల్పోయింది. సింగూరు జలాశయానికి ఏ క్షణంలోనైనా గండిపడవచ్చనే హెచ్చరికలున్న నేపథ్యంలో 21 టీఎంసీలకు మించి నీళ్లను నిల్వ చేయడం లేదు. కాగా నీటి నిల్వలకు అవకాశం ఉన్న జలాశయాలూ ఖాళీగా ఉండడం గమనార్హం.