
కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దని, రాజకీయ నేతలు నీతి, నిజాయితీతో సేవలందించి స్ఫూర్తిగా నిలవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్‌లోని జేపీఎన్సీ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ముందుగా రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డితో కలిసి కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్.జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జయ ప్రకాశ్ నారాయణ్ 120వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అన్యాయాలు, అక్రమాలకు అరాచకా నికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పటిష్టతకు అలుపె రగకుండా పోరాటం చేసిన గొప్ప నాయకుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ అని.. ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చాన ని వెల్లడించారు.
తాను, జైపాల్‌రెడ్డి ఇద్దరమూ జాతీయవాదులమే.. అయినా సిద్ధాంతపరంగా భిన్నమైనవాళ్లమని అన్నారు. చట్టసభల్లో ఉన్నత ప్రమాణాలు పాటించాలని.. డిస్కస్, డిబేట్, డిస్క్రైబ్ చేయాలి కానీ డిస్ట్రబ్ చేయకూడదన్నారు. చట్టసభల్లో మాట్లాడండి, శాంతియుతంగా పోరాడండి, కానీ సభను జరగనివ్వండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండని పిలుపునిచ్చారు. కలలు కనండి, కష్టపడండి, సాకారం చేసుకోండని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో జైపాల్‌రెడ్డి భార్య లక్ష్మి, ఆయన సోదరుడు పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.