రాంగ్‌ రూట్‌లోనే వస్తా.. ఏం చేసుకుంటావో చేసుకో..! | ex mla follower misbehaves with woman constable | Sakshi
Sakshi News home page

రాంగ్‌ రూట్‌లోనే వస్తా.. ఏం చేసుకుంటావో చేసుకో..!

May 4 2026 12:27 PM | Updated on May 4 2026 12:47 PM

ex mla follower misbehaves with woman constable

రంగారెడ్డి: ‘నేనెవరో తెలుసా.. రాంగ్‌ రూట్‌లోనే వస్తా.. ఏం చేసుకుంటావో చేసుకో’.. అంటూ ఓ నాయకుడు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన షాద్‌నగర్‌ పట్టణంలోని చటాన్‌పల్లి రైల్వేగేట్‌వద్ద చోటు చేసుకుంది. వివరా లిలా ఉన్నాయి.. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో పట్టణంలోని చటాన్‌పల్లి రైల్వేగేట్‌వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. దీంతో ఆదివారం ట్రాఫిక్‌ నియంత్రణకు మహిళా కానిస్టేబుల్‌ తిరుపతమ్మ విధులు నిర్వర్తిస్తున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు.

 అదే సమయంలో ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా తన వాహనంపై రాంగ్‌ రూట్‌లో వచ్చాడు. ఎదురుగా వచ్చిన వాహనాలకు తీవ్ర అంతరాయం కలగడంతో ట్రాఫిక్‌ జాం అయింది. రాంగ్‌ రూట్‌లో వాహనదారులకు ఇబ్బంది కలుగుతోందని, సరైన మార్గంలో రావాలని మహిళా కానిస్టేబుల్‌ సూచించారు. దీంతో నేనెవరో తెలుసా, నేను మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిని, నా ఇష్టం వచ్చినట్లు రాంగ్‌రూట్‌లోనే వస్తా, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ దురుసుగా ప్రవర్తించాడు. అలాగే రాంగ్‌రూట్‌లో వెళ్లిపోయాడు. సదరు మహిళా కానిస్టేబుల్‌ విధులు ముగిసిన తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విషయాన్ని తోటి సిబ్బందికి చెప్పి విలపించారు. 

అనంతరం పట్టణంలోని చటాన్‌పల్లి రైల్వే గేటు వద్ద తన విధులకు ఆటంకం కలిగించాడని చటాన్‌పల్లికి చెందిన నాగరాజుపై మహిళా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ తిరుపతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడం, దురుసుగా ప్రవర్తించడంతోపాటు దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నాగరాజుపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సీతారాం తెలిపారు. సదరు నాయకుడు గత శివరాత్రి సందర్భంగా మండల పరిధిలోని రామేశ్వరంలో విధుల్లో ఉన్న పోలీసులపై సైతం ఇలాగే జులుం ప్రదర్శించాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు నాయకుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement