రాజకీయ కక్షతోనే కమిషన్‌ ఏర్పాటు: కేసీఆర్‌ సీరియస్‌ లేఖ | Ex CM KCR Writes Letter To Narasimha Reddy Commission Over Power | Sakshi
Sakshi News home page

నాడు కరెంట్‌ ఉంటే వార్త.. నేడు పవర్‌ లేకుంటే వార్త: కేసీఆర్‌ సీరియస్‌ లేఖ

Published Sat, Jun 15 2024 12:09 PM | Last Updated on Sat, Jun 15 2024 1:26 PM

Ex CM KCR Writes Letter To Narasimha Reddy Commission Over Power

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ కక్షతోనే నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేశారని అన్నారు మాజీ సీఎం కేసీఆర్‌. కుట్రలతోనే నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, తాజాగా జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ 12 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో కేసీఆర్‌..‘రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లల్లో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉంది ఇది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా సక్రమంగా నడవలేకపోయింది. రాష్ట్రంలో పవర్ హాలిడేలు, కరెంటు కోతలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.

నాడు గ్రామాల్లో ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు కరెంటు కోతలు ఉండేవి. త్రీఫేస్ కరెంట్ కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు తెలంగాణకు చట్ట ప్రకారం 53.89% ఆంధ్రప్రదేశ్‌కు 46.1 శాతం కేటాయించి ఆ విధంగా పది సంవత్సరాల పాటు విద్యుత్‌ను వినియోగించుకోవాలని నిర్దేశించింది.

విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆనాటి ప్రభుత్వం తెలంగాణకు కరెంటు సరఫరా ఇవ్వకుండా 1500 మెగావాట్లు గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి 2,400 మెగావాట్ల లోటు ఏర్పడింది. మొత్తంగా ఐదు వేల మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దీన్ని అధిగమించి కొత్త ప్రాజెక్టులు నిర్ణయించి కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7778 మెగావాట్లు విద్యుత్తు 20000 మెగావాట్లకు పైచిలుకు చేరటం మా ప్రభుత్వానికి నిదర్శనం

తెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త ఇప్పుడు కరెంటు పోతే వార్త. రాజకీయ కక్షతో నన్ను అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కరెంటు కోసం తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయంగా మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

కేసీఆర్‌ లేఖ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విచారణ కోసం నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలచి ఇచ్చినట్టుగా మాట్లాడడం నాకు ఎంతో బాధ కలిగించింది. ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది.

విచారణ పూర్తికాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతోంది. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement