సంస్థాగతం.. ముమ్మరం | Efforts underway to appoint Mandal and Block Congress Committees | Sakshi
Sakshi News home page

సంస్థాగతం.. ముమ్మరం

Apr 23 2026 3:09 AM | Updated on Apr 23 2026 3:09 AM

Efforts underway to appoint Mandal and Block Congress Committees

మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీల నియామకానికి కసరత్తు 

అధ్యక్ష పదవికి మూడేళ్లు పార్టీలో పనిచేయాలన్న నిబంధన 

11–21 మందితో కార్యవర్గాల కూర్పు  

60% పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: అధికార కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ ముమ్మరమైంది. పార్టీ మండల, బ్లాక్, మున్సిపల్‌ కమిటీల నియామకం కోసం రాష్ట్రవ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది. పీసీసీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రక్రియ ఈనెల 25వ తేదీలోపు ముగియనుంది. ఈ కమిటీల కూర్పులో డీసీసీ అధ్యక్షులకు సహకరించేందుకు గాను రాష్ట్ర స్థాయి సమన్వయకర్తలను కూడా నియమించారు. ఏఐసీసీ నిబంధనలు, పీసీసీ సూచనల మేరకు శనివారం నాటికి ఈ కమిటీల నియామకాలు పూర్తి కానున్నాయి.  

బూత్‌ స్థాయి నుంచి..  
సంస్థాగత నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ క్షేత్రస్థాయిలో కమిటీలను నియమిస్తోంది. పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి ఏజెంట్ల నియామకంతో పాటు మండల, బ్లాక్, మున్సిపల్‌ కమిటీలను ఏర్పాటు చేసుకుంటోంది. ఈ కమిటీల్లో అధ్యక్షుడితో పాటు కనీసం 11–21 మంది కార్యవర్గంలో ఉండేలా నియామకాలు జరుగుతున్నాయి. ప్రతి కమిటీలో కనీసం 60 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకివ్వాలని పీసీసీ ఆదేశించింది. దీంతో పాటు మండల, బ్లాక్, మున్సిపల్‌ అధ్యక్ష పదవుల కోసం కనీసం మూడేళ్ల పాటు పార్టీలో పనిచేయాలన్న నిబంధన కూడా విధించింది. 

ఈ మేరకు పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్న డీసీసీ అధ్యక్షులు గడువులోపు కమిటీలను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. అయితే, ఈ కమిటీల కూర్పులోనూ సమస్యలు వస్తున్నాయని గాం«దీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలున్న చోట్ల పాత, కొత్త.. అనే సమస్యలు వస్తున్నాయి. 

బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల్లో పలు హోదాల్లో పనిచేసి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి తగిన గౌరవం ఇవ్వాలని, పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని ఆ ఎమ్మెల్యేలు కోరుతుంటే, ఏళ్ల తరబడి పార్టీ జెండా మోస్తున్న వారికే ప్రాధాన్యతనివ్వాలని స్థానిక నాయకత్వం కోరుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు సమస్యల్లేని కమిటీలన్నింటినీ ఫైనల్‌ చేయాలని, సమస్యలు వచ్చిన చోట పీసీసీ పరిష్కరిస్తుందని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఈ కమిటీలను పూర్తి చేస్తారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. 

త్వరలోనే పంపుతాం.. 
మండల, బ్లాక్, మున్సిపల్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని, బూత్‌ స్థాయి ఏజెంట్లను కూడా నియమించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీలు, ఇతర ముఖ్య నేతల తో మాట్లాడి కమిటీలకు రూపకల్పన చేస్తున్నాం. అన్ని కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనలపై పీసీసీ అధ్య క్షుడు, పార్టీ ముఖ్య నేతలతో చర్చించి ఫైనల్‌ చే స్తాం. ఈ కమిటీల నియామకం విషయంలో సమస్యలున్న నియోజకవర్గాలకు సంబంధించిన తుది నిర్ణయం పీసీసీనే తీసుకుంటుంది.    – పున్నాౖకైలాశ్‌ నేత,నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement