Telangana: ఫీజు వసూళ్లపై ప్రైవేటు విద్యాసంస్థలకు సర్కారు హెచ్చరిక

Education Minister Sabitha Indra Reddy Warns Private School Managements Of Strict Action - Sakshi

వేధింపులపై నిఘాకు ఆదేశించాం

కరోనా పరిస్థితుల్లో మానవత్వంతో వ్యవహరించాలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పాఠశాలల్లో కరోనా నిబంధనల అమల్లో రాజీపడే ప్రసక్తే లేదు

తల్లిదండ్రులు తమకు ఇష్టమైతేనే పిల్లలను స్కూళ్లకు పంపాలి 

సాక్షి, హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం.. కళాశాలలు, స్కూళ్లలో కరోనా నిబంధనల అమలుతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల వసూళ్లపై దృష్టి సారించింది. కరోనా కష్టకాలంలో ఫీజుల కోసం తల్లిదండ్రులను ఒత్తిడి చేసే విద్యాసంస్థల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రైవేటు సంస్థలు మానవత్వంతో వ్యవహరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల కోసం వేధిస్తున్న ఉదంతాలు తమ దృష్టికొచ్చాయని మంత్రి తెలిపారు. దీనిపై నిఘా పెట్టాల్సిందిగా అధికారులకు సూచించామన్నారు. ఫీజుల కోసం వేధిస్తే రాష్ట్ర ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఇచ్చామని, అయితే ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.  

తల్లిదండ్రుల కోరిక మేరకే.. 
 విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకే వచ్చేనెల ఒకటి నుంచి అన్ని విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు మంత్రి సబిత తెలిపారు. కరోనా నిబంధనల అమల్లో ప్రభుత్వం రాజీపడబోదని, ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పర్యవేక్షణకు అధికారులను నియమించామని వెల్లడించారు. తల్లిదండ్రులు ఇష్టపడితేనే పిల్లలను స్కూళ్లకు పంపాలని చెబుతున్నామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడీ లేదన్నారు.  

అవసరమైతే అందరికీ పరీక్షలు 
    పాఠశాలలకు పంపే విద్యార్థులకు అనారోగ్య సమస్యలొస్తే తమదే బాధ్యతంటూ.. తల్లిదండ్రుల నుంచి ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ముందుగానే అంగీకారపత్రం తీసుకుంటున్న వైనంపై మంత్రి ఘాటుగా స్పందించారు. విద్యార్థులు కరోనా బారిన పడకుండా చూసే విషయంలో అందరూ భాగస్వాములు కావాల్సిందేనన్నారు. తరగతి గదిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే క్లాసులోని పిల్లలందరికీ పరీక్షలు చేయిస్తామని, ఎక్కువ మందికి లక్షణాలుంటే స్కూలు మొత్తం పరీక్షలు చేయిస్తామని మంత్రి తెలిపారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విద్యాసంస్థను మొత్తం మూసేసే ఆలోచన లేదన్నారు. 

నేడు డీఈవోలతో భేటీ.. 
    విద్యాసంస్థల పునఃప్రారంభంపై సోమవారం డీఈవోలతో సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. అవసరమైతే కొత్త మార్గదర్శకాలూ ఇస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సమాచారం సేకరిస్తున్నామని, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయాల సమస్యలపై త్వరలో వీసీలతో సమావేశం కానున్నట్లు తెలిపారు.  

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రాయాల్సిందే..
ఇంటర్‌ సెకండియర్‌కు ప్రమోట్‌ అయిన విద్యార్థులంతా ఫస్టియర్‌ పరీక్షలు రాయాల్సిందేనని మంత్రి సబిత స్పష్టం చేశారు. పరీక్షలు ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులను ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా సెకండియర్‌కు ప్రమోట్‌ చేసింది. వీరికి ఫస్టియర్‌ పరీక్షలు ఐచ్ఛికమనే ప్రచారం తొలుత జరిగింది. కానీ మంత్రి సబిత దీన్ని కొట్టిపారేశారు. విద్యార్థులంతా పరీక్షలు రాయాల్సిందేనంటూ స్పష్టత ఇచ్చారు. దీని వెనుక బలమైన కారణాలున్నట్టు తెలుస్తోంది. కరోనా మూడోదశ ప్రచారం నేపథ్యంలో ఒకవేళ సెకండియర్‌ పరీక్షలనూ నిర్వహించలేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటనే సందేహాలు విద్యాశాఖ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. ఫస్టియర్‌ మార్కుల్నే ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్‌ బోర్డు అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు స్పష్టమవుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top