సినిమా ఆపండి: ధర్నాకు దిగిన దిశ తండ్రి

Disha Father Protest At Ram Gopal Varma Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘దిశ..ఎన్‌కౌంటర్‌’ సినిమా విడుదల నిలిపేయాలని హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఆదివారం ఉదయం రాంగోపాల్‌ వర్మ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాకు దిగారు. ఆయన వెంట పలువురు మహిళలు, స్నేహితులు ఉన్నారు. వారంతా దిశ సినిమాను ఆపాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దిశ కుటుంబాన్ని వర్మ తన సినిమాతో మరింత ఆవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎమోషన్లని డబ్బు చేసుకోవాలనుకుంటున్న ఆర్జీవీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, దిశపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి దర్శకుడు రాంగోపాల్‌ వర్మ నిర్మిస్తున్న సినిమాను ఆపేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్‌ బోర్డును ఆదేశించాలంటూ శ్రీధర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌  దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దిశపై లైంగిక దాడి, హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని ఈమేరకు శ్రీధర్‌రెడ్డి తరఫు న్యాయవాది నివేదించారు. అయితే ఈ సినిమా నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్‌ ఎటువంటి వినతిపత్రం సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌రావు నివేదించారు. స్పందించిన న్యాయమూర్తి.. కేంద్ర ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డును దిశ తండ్రి ఇచ్చే వినతిపత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం
తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.
(చదవండి: ‘ఇది దిశ బయోపిక్‌ కాదు.. నిజాలు చెప్తున్నాం’)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top