ఆతిథ్యం తీరు మారింది

Demand for Home Quarantine in Greater hotels - Sakshi

గ్రేటర్‌లో హోటల్‌ క్వారంటైన్‌కు పెరుగుతోన్న డిమాండ్‌

ఆస్పత్రి స్థాయిలో పలు త్రీస్టార్, ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో ఏర్పాట్లు

గది అద్దె రోజుకు రూ.7 వేలు – రూ.10 వేలు

నిరంతరం వైద్యుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు

నగరంలోని హోటల్‌ క్వారంటైన్‌లో మూడు వేల మంది రోగులు

సాక్షి,హైదరాబాద్ ‌: 
గ్రేటర్‌లో హోటల్‌ క్వారంటైన్‌కు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న పలువురు రోగులు ఇంట్లో అందరితో కలసి ఉండకుండా హోటల్‌ గదిలో సెల్ఫ్‌ ఐసోలేషన్‌ అయ్యేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ట్రెండ్‌ క్రమంగా పెరుగుతుండటంతో నగరంలో ప్రస్తుతం పలు త్రీస్టార్, ఫైవ్‌స్టార్‌ హోటళ్లు క్వారంటైన్‌ కేంద్రాలుగా మారడం విశేషం. ప్రస్తుతానికి గ్రేటర్‌ పరిధిలో సుమారు 50 హోటళ్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఆయా హోటళ్ల యాజమాన్యాలు పలు ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకోవడంతో అత్యవసర వైద్య సేవలందించేందుకు నేరుగా వారిని ఆస్పత్రులకు తరలించే ఏర్పాట్లు చేయడం విశేషం.

హోటల్‌ క్వారంటైన్‌ ఇలా..
సికింద్రాబాద్,బేగంపేట్,కొండాపూర్,గచ్చిబౌలి,హైటెక్‌సిటీ,సోమాజిగూడా,నాంపల్లి,మాదాపూర్,లింగంపల్లి,సోమాజిగూడ,కోకాపేట్‌ తదితర ప్రాంతాల్లోని సుమారు 50 హోటళ్లలో కోవిడ్‌ రోగులకు ప్రత్యేకంగా గదులను ఏర్పాటుచేసి ఆస్పత్రిలో ఉండేరీతిలో వసతులు కల్పిస్తున్నారు. ఆయా హోటల్‌ గదుల్లో సుమారు మూడువేల మంది వరకు కోవిడ్‌ రోగులు బసచేసినట్లు సమాచారం. నిత్యం ఒక్కో రూమ్‌కు రూ.7 నుంచి రూ.10 వేల వరకు ఆయా హోటళ్ల యాజమాన్యాలు అద్దె వసూలు చేస్తున్నాయి. ఇక ఆరోగ్య పరిస్థితి విషమించిన వారిని నేరుగా ఆస్పత్రిలో చేర్పించి వారికి బెడ్‌ ఏర్పాటు చేసేందుకు సైతం ఆయా హోటళ్ల యాజమాన్యాలు నగరంలోని ప్రధాన ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ప్రస్తుతం నగరంలో సుమారు మూడువేల మంది కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నవారు ఆయా హోటళ్లలో మకాం వేసినట్లు హోటల్‌రంగ నిపుణులు చెబుతున్నారు.

హోటళ్లలో కల్పిస్తున్న సదుపాయాలివీ..
కోవిడ్‌ రోగులు, కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారికి బస చేసేందుకు పలు ఆఫర్లు ప్రకటిస్తున్న పలు హోటళ్లు అందుకు తగినట్లుగా పలు వసతులు కల్పిస్తున్నాయి.
నిత్యం డాక్టర్‌తో చెకప్‌ సదుపాయం.

► ఆన్‌లైన్‌లో అవసరమైన సమయంలో నర్సుల ద్వారా సలహాలు,సూచనలు అందజేయడం
► ఫిజియోథెరపిస్ట్, డైటీషియన్‌ల సలహాలు,సూచనలు అందించడం.
► ఫింగర్‌ పల్స్‌ ఆక్సీమీటర్,స్పైరోమీటర్,డిజిటల్‌ థర్మామీటర్‌ ద్వారా వైద్యసేవలు.
► గది వద్దకే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో లంచ్, డిన్నర్‌ అందజేయడం.
► బీసేఫ్‌ యాప్‌ ద్వారా రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తనిఖీచేసి వారి పరిస్థితిని అంచనా వేయడం.
► అత్యవసర సమయంలో తమ హోటల్‌లో బసచేసిన రోగిని ఆస్పత్రికి తరలించి కచ్చితంగా బెడ్‌సదుపాయం కల్పించడం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top