24 అంతస్తులతో.. 18 నెలల్లో..అతిపెద్ద సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి

Decision To Complete Construction Of Super Speciality Hosipital In Warangal - Sakshi

అతిపెద్ద సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేయాలని నిర్ణయం

మార్చి 15న నిర్మాణ సంస్థతో ఒప్పందం.. వెంటనే పనులు మొదలు

ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించిన అధికారులు

రూ.1,100 కోట్ల సింగిల్‌ టెండర్‌తో ఆర్‌ అండ్‌ బీ చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రంగం సిద్ధమైంది. వరంగల్‌లోని పాత సెంట్రల్‌ జైలు స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ భారీ ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ తాజాగా ప్రీబిడ్‌ సమావేశాన్ని నిర్వహించింది. టెండర్లు దాఖలు చేసిన నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మార్చి 15న నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగిన వెంటనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. సింగిల్‌ టెండర్‌లో రూ.1,100 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టే రోడ్లు, భవనాల శాఖ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టు కావడం విశేషం.

ఇప్పటివరకు రోడ్లు, వంతెనలు, భవనాలు.. ఇలా ఏ కేటగిరీలో చూసినా అంత మొత్తంతో కూడిన సింగిల్‌ టెండర్‌ ప్రాజె క్టును ఆ శాఖ చేపట్టలేదు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాంటి లోపాలు లేకుండా గడువులోగా చేసి చూపాలని అధికారులు భావిస్తున్నారు. ఒప్పందం కుదిరిన నాటి నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023 సెప్టెంబర్‌ ఆఖరుకల్లా ఆసుపత్రి భవనం అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం.

24 అంతస్తులతో..
ఇటీవల ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలి సిందే. ఆరు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భాగంగా వరంగల్‌లో చేపట్టేదే అతి పెద్దది. మిగతా ఐదు వేయి పడకలతో కూడినవి కాగా, వరంగల్‌ ఆసుపత్రి మాత్రం 1,750 పడకలతో నిర్మించను న్నారు. ఇప్పటికే పాత జైలు భవనాన్ని కూల్చి చదును చేశారు.

60 ఎకరాల సువిశాల స్థలంలో 24 అంతస్తులతో నిర్మిస్తారు. ఇక్కడ 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం అందు బాటులోకి రానుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో లేన ట్టుగా మొత్తం 34 విభాగాలతో కూడిన ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ రూపుదిద్దుకోనుంది. ఇందుకు మంచి ఎలివేషన్‌తో కూడిన డిజైన్‌ను సిద్ధం చేశారు. మూడు బ్లాకులుగా ఉండే ఈ భవనం ముందు భారీ పచ్చిక మైదానం,   విశాలమైన ఫౌంటెయిన్‌ ఏర్పాటు చేస్తారు.

నిమ్స్‌ విస్తరణ
ఇప్పటివరకు వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవనమే రాష్ట్రంలో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా ప్లాన్‌ చేయగా, మరోవైపు ఏకంగా 2 వేల పడకలతో నిమ్స్‌ ఆసుపత్రి విస్తరణ ప్రాజెక్టును కూడా రోడ్లు, భవనాల శాఖ చేపట్టనుంది. దీనికి సంబంధించి ప్లాన్లను సిద్ధం చేసే పనుల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న నిమ్స్‌ ఆసుపత్రి భవనానికి అనుబంధంగా ఈ నిర్మాణం జరగనుంది. ఇందుకు పక్కనే ఉన్న ఎర్రమంజిల్‌ క్వార్టర్స్‌ కాలనీని ఎంపిక చేశారు. దాదాపు 19 ఎకరాల్లో విస్తరించిన ఆ కాలనీ మొత్తాన్ని తొలగించి అక్కడ భారీ భవన సముదాయాలను నిర్మించనున్నారు. అక్కడున్న దాదాపు 300 క్వార్టర్స్‌ను ఇప్పటికే ఖాళీ చేయగా, త్వరలో వాటిని కూల్చనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top