
ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగిన గాలింపు
సహాయక చర్యల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, డీడీఆర్‌ఎఫ్, ఫైర్, పోలీసు బృందాలు
మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం
కాళేశ్వరం: వివాహ వేడుకలకు హాజరై.. సరదా కోసం ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు నదీగర్భంలో ఆదివారం లభ్యమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ ఎగువన మూడవ బ్లాక్ వద్ద గోదావరి లోతు ప్రవాహ ప్రాంతంలో అంబట్‌పల్లికి చెందిన పట్టి వెంకట్‌స్వామి ఇద్దరు కుమారులు మధుసూదన్ (18), శివమనోజ్ (15), కర్ణాల సాగర్ (16), తొగరి రక్షిత్ (13), మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రామ్‌చరణ్ (17), అదే మండలం స్తంభంపల్లి (పీపీ)కి చెందిన పసుల రాహుల్ (19)తో మేడిగడ్డ బ్యారేజీ చూసి గోదావరిలో ఈతకు వెళ్లి శనివారం సాయంత్రం 6 గంటలకు నీట మునిగారు. ఆ ఘటనలో పట్టి శివమణి (18) ప్రాణాలతో బయటపడ్డాడు.
ముమ్మర గాలింపు..
ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి భూపాలపల్లి ఏఎస్పీ నరేశ్‌కుమార్, కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, ఎస్‌డీఆర్‌ఎఫ్ డీఎస్పీ వేణుగోపాల్‌రెడ్డి, డీడీఆర్‌ఎఫ్, స్థానిక, సిరొంచ జాలర్లు, సింగరేణి రెస్క్యూ టీంలు స్పీడ్ బోట్లు, నాటు పడవల సాయంతో ముమ్మరంగా గాలించాయి.
ఏడు గంటలపాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఆరుగురి మృతదేహాల ఆచూకీ నీటమునిగిన ప్రాంతం నుంచి 50 మీటర్ల దూరంలో లభించింది. మృతదేహాలను వెలికి తీసి అంబులెన్స్‌ల ద్వారా మహదేవపూర్ సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబాలకు మృతదేహాలు అప్పగించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో మేడిగడ్డ ప్రాంతం శోకసంద్రంగా మారింది.