ఎంత పని జేశినవ్‌ అక్క..!

Cyberabad Traffic Police Tweet Memes To Aware People Road Safety - Sakshi

వైరలవుతోన్న సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ట్వీట్‌

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే అంతే

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ రూల్స్‌ ఉండేది ఎందుకు.. మనం జాగ్రత్తగా.. సేఫ్‌గా గమ్యం చేరడానికి. హెల్మెట్‌ ధరించండి.. సీటు బెల్ట్‌ పెట్టుకోండి.. తాగి డ్రైవ్‌ చేయకండి వంటి నిమయాలన్ని మన సేఫ్టి కోసం పెట్టినవే. కానీ జనాలు మాత్రం రూల్స్‌ ఉల్లంఘిస్తూ.. ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడుపుతారు. ఇక చలానాల నుంచి తప్పించుకోవడానికి జనాలు వేసే వేషాలు.. పడే పాట్లు చూస్తే.. వీళ్లు ఇక్కడ ఉండాల్సిన వాళ్లు కాదు అనిపిస్తుంది. గతంలో కేబుల్‌ బ్రిడ్జి మీద ఓ కుటుంబం నంబర్‌ ప్లేట్‌ మీద చున్నీ వేసిన ఘటన చూశాం.

ఇక మరి కిందరు టీఎస్‌ తర్వత వచ్చే ఆల్ఫాబెట్‌ సిరీస్‌ కనపడకుండా స్టిక్కర్‌ అంటించడం.. మూతికి పెట్టుకోవాల్సిన మాస్క్‌ నంబర్‌ ప్లేట్‌కు పెట్టడం... ఇక బండి మీద వెనక కూర్చున్న ఆడవారు చున్నీ, చీర కొంగుతో బైక్‌ నంబర్‌ ప్లేట్‌ కనపడకుండా చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఎన్ని వేషాలు వేసినా.. ఒక్కసారి ట్రాఫిక్‌ వారి కంట్లో పడితే.. తాటా తీయడం మాత్రం ఖాయం. అంతేకాదండోయ్‌.. మనకు అర్థం అయ్యేలా చేయడానికి సూపర్‌ హిట్‌ సినిమాల నుంచి మీమ్స్‌ కూడా క్రియేట్‌ చేస్తున్నారు. 

తాజాగా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తమ ట్విట్టర్‌ ఖాతాలో ఇలాంటి మీమ్‌ను షేర్‌ చేయగా.. ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. ‘‘చలానాలు పడకుండా ఉండాలంటే ట్రాఫిక్ నియమాలు పాటించడం ఒకటే ఉత్తమ మార్గం. విన్యాసాలు చేసి తప్పించుకోవడం కాదు’’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటోలో ఓ బైక్‌ మీద ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. బైక్‌ నడిపే వ్యక్తికి మాత్రమే హెల్మెట్‌ ఉంది. ఇక ట్రిపుల్‌ రైడింగ్‌కి చలానా పడుతుంది. దాంతో బైక్‌ మీద కూర్చున్న మహిళ అతి తెలివితో నంబర్‌ ప్లేట్‌ సరిగా కనపడకుండా ఉండేందుకుగాను తన కాలిను దాని మీద పెట్టింది. ఇది కాస్తా ట్రాఫిక్‌ పోలీసుల కంట్లో పడింది. ఇంకేముంది వారు రంగంలోకి దిగి బైక్‌ నంబర్‌ ప్లేట్‌ని గుర్తించి.. 2,800 రూపాయల చలానా విధించారు. 
(చదవండి: ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది?)

కావాలని వాహనం సమాచారం దాచినందుకు 500 రూపాయలు.. ప్రమాదకర డ్రైవింగ్‌కు 1,000 రూపాయలు.. ట్రిపుల్‌ డ్రైవింగ్‌కు 1,200.. వెనక కూర్చున్న వారికి హెల్మెట్‌ లేనందుకు గాను 100 రూపాయల చొప్పున మొత్తం 2,800 రూపాయల చలానా విధించారు. ఇక వీరి ఫోటోతో పాటు షేర్‌ చేసిన మీమ్‌ సూపర్‌. అత్తారింటికి దారేది సినిమాలోని క్లైమాక్స్‌ సీన్‌ని వీరికి అన్వయిస్తూ.. ‘‘నువ్వేమో 1,300 రూపాయలు కాపాడాలని కాలు పెట్టావ్‌.. కానీ నువ్వు చేసిన పనికి ఇంకో 1500 రూపాయలు ఎక్కువ పడ్డాయి’’ అంటూ క్రియేట్‌ చేసిన మీమ్‌ సూపర్బ్‌ అంటూ నెటిజనులు కామెంట్‌ చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top