కరోనా తీవ్రరూపం: కిట్లు లేవు.. టీకాలు లేవు! 

Coronavirus Second Wave Spreading More In Nizamabad District - Sakshi

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ర్యాపిడ్‌ టెస్టుల కిట్లు, వ్యాక్సిన్‌ నిల్వలు నిండుకున్నాయి. మంగళవారం జిల్లాలో 5,407 ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా, 445 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ర్యాపిడ్‌ టెస్టుల కిట్లు సరిపోకపోవడంతో పలు ఆరోగ్య కేంద్రాల్లో వందలాది మంది కరోనా బాధితులు టెస్టులు చేయించుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. జిల్లా వైద్య శాఖ అధికారులు ర్యాపిడ్‌ కిట్ల కోసం రాష్ట్ర ఉన్నతాధికారులకు విన్నవించారు. హైదరాబాద్‌ నుంచి కిట్లు వస్తే తప్ప బుధవారం ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించే పరిస్థితి లేదు.

జిల్లా వ్యాప్తంగా 5,007 మందికి 52 సెంటర్లలో వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సిన్‌ నిల్వలు కూడా పూర్తిగా నిండుకున్నాయి. వ్యాక్సిన్‌ వస్తేనే టీకా కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటివరకు జిల్లాలో 97,371 మందికి టీకా వేశారు. వ్యాక్సిన్‌ను రోజూ 6 వేల నుంచి 7 వేల మంది వరకు తీసుకుంటున్నారు. మూడు, నాలుగు రోజులకు ఓసారి హైదరాబాద్‌ నుంచి 12 వేల నుంచి 14 వేల వరకు టీకాలు వస్తున్నాయి. 

సెల్ఫ్‌ లాక్‌డౌన్‌లు.. 
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌లు విధించుకుంటున్నారు. ఇప్పటికే 15 గ్రామాలకు పైబడి సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. జిల్లాలో కరోనా వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన 56 ప్రైవేట్‌ ఆస్పతులు నిండిపోయాయి. సుమారు 1,200 మంది వరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనే చికిత్సలు పొందుతున్నారు. ప్రస్తుతం ఆయా ఆస్పత్రుల్లో పడకలు దొరకట్లేదు. ఆక్సిజన్‌ అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు రోగులే తెచ్చుకోవలంటూ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.మూడున్నర వేలకు లభించే ఇంజెక్షన్‌ బ్లాక్‌ మార్కెట్‌లో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు విక్రయిస్తున్నారు.

జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో 500 పడకల సామర్థ్యం ఉండగా, 415 వరకు పడకలు కరోనా రోగులతో నిండిపోయాయి. ఇందులో 153 మంది ఐసీయూలో ఉన్నారు. 34 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 2,530 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత ఏప్రిల్‌ 10 నుంచి ఇప్పటివరకు 2,720 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 18 వరకు అధికారిక లెక్కల ప్రకారం 32 మంది మరణించారు. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. 

కామారెడ్డి జిల్లాలో.. 
కరోనా వైరస్‌ కామారెడ్డి జిల్లాను 20 రోజులుగా వణికిస్తోంది. రోజూ వందల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు 2.2 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 21,317 మంది కరోనా బారిన పడగా, 15,292 మంది కోలుకున్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 45 మంది కోవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా వార్డులో చికిత్స పోందుతూ 9 మంది మృతి చెందారు. 

మహారాష్ట్ర ప్రభావం.. 
సరిహద్దులోని మహారాష్ట్రలో ఉధృతంగా ఉన్న కరోనా వైరస్‌ నిజామాబాద్‌ జిల్లాపై ప్రభావం చూపింది. మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతాలైన సాలూర, కందకుర్తి, కండ్‌గావ్, తుక్కిని, మందర్న, పోతంగల్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో త్వరితగతిన చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వైద్యశిబిరాలను ఏర్పాటు చేయలేదు. దీంతో మహారాష్ట్ర నుంచి జిల్లాకు రాకపోకలు కొనసాగాయి. ముఖ్యంగా బోధన్‌ ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని బిలోలి, కొండల్‌వాడి, ధర్మాబాద్, నాందేడ్, నార్సీ, నాయగాం ప్రాంతాల నుంచి జిల్లాకు రాకపోకలు ఎక్కువగా కొనసాగుతాయి. రోజూ 35 ఆర్టీసీ బస్సులు, ఐదు రైళ్లు, వందకు పైగా స్కూళ్లు, ఇతర వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. సాలూర అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టు వద్ద నిత్యం 150 నుంచి 200 మంది వరకు పరీక్షలు చేస్తున్నారు. మంగళవారం కిట్ల కొరత వల్ల 73 మందికే కరోనా పరీక్షలు నిర్వహించారు.
చదవండి: హైదరాబాద్‌: రాత్రి 7 వరకే సిటీ బస్సులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top