కన్నుమూస్తూ మరొకరికి పునర్జన్మ

Constable Organ Donation Gives New Life Of Painter At Malakpet Yashoda - Sakshi

కానిస్టేబుల్‌ గుండె పెయింటర్‌కు..

మలక్‌పేట యశోద నుంచి నిమ్స్‌కు తరలింపు

ప్రత్యేక గ్రీన్‌ చానెల్‌ ద్వారా 12 నిమిషాల్లో 9.8 కి.మీ. ప్రయాణం 

సాక్షి, హైదరాబాద్‌/కూసుమంచి: కానిస్టేబుల్‌ కన్నుమూస్తూ మరొకరికి పునర్జన్మను ప్రసాదించారు. చనిపోయి కూడా ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఖమ్మం జిల్లా కుసుమంచికి చెందిన వీరబాబు(35) కొండాపూర్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌. మూడు రోజుల క్రితం బైక్‌పై ఖమ్మం వెళ్తూ మార్గమధ్యలో గొల్లగూడ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు.మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించగా అప్పటికే తలకు బలమైన గాయమై మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆరోగ్యపరిస్థితి విషమించింది. ఈ క్రమంలో వైద్యులు మంగళవారం సాయంత్రం బ్రెయిన్‌ డెడ్‌గా డిక్లేర్‌ చేశారు. ఈ నేపథ్యంలో వీరబాబు అవయవాలు దానం చేసేందుకు బంధువులు అంగీకరించడంతో వైద్యులు వెంటనే జీవన్‌దాన్‌కు సమాచారమిచ్చారు.  

9.8 కిలోమీటర్లు.. 12 నిమిషాల్లో...  
ఖమ్మం జిల్లాకు చెందిన పెయింటింగ్‌ కార్మికుడు తుపాకుల హుస్సేన్‌(33) అప్పటికే గుండె పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో గుండెమారి్పడి చికిత్స నిమిత్తం గుండె కోసం జీవన్‌దాన్‌లో సోమవారం రిజిస్టర్‌ చేసుకున్నారు. దాత కోసం ఎదురు చూస్తుండగా ఆ మరునాడే వీరబాబు గుండె  ప్రదానం విషయం ఖరారు కావడం విశేషం.    డాక్టర్‌ సాయిసునీల్, డాక్టర్‌ రవితేజలతో కూడిన వైద్య బృందం బుధవారం ఉదయం మలక్‌పేట యశోద ఆస్పత్రికి చేరుకుని అక్కడి వైద్యుల సహకారంతో దాత శరీరం నుంచి గుండెను వేరు చేసింది. దానిని ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి రోడ్డుమార్గంలో అంబులెన్స్‌లో నిమ్స్‌కు చేర్చింది. అప్పటికే ట్రాఫిక్‌ పోలీసులుగ్రీన్‌చానల్‌ ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌ మధ్యాహ్నం 1.44 గంటలకు యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరి 9.8 కిలోమీటర్లు ప్రయాణించి 1.56 గంటలకు.. అంటే కేవలం 12 నిమిషాల్లో నిమ్స్‌కు చేరుకుంది.  


గుండెను భద్రపరిచిన బాక్స్‌ను తీసుకువస్తున్న నిమ్స్‌ వైద్య బృందం

పదిమంది.. ఆరు గంటలు శ్రమించి 
డాక్టర్‌ అమరేష్‌రావు నేతృత్వంలోని డాక్టర్‌ గోపాల్, డాక్టర్‌ మధుసూదన్, డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ నర్మద, డాక్టర్‌ అర్చనలతో కూడిన బృందం మధ్యాహ్నం రెండు గంటలకు గుండె మారి్పడి చికిత్స ప్రారంభించి రాత్రి ఎనిమిది గంటలకు పూర్తి చేసింది. స్వీకర్త నుంచి సేకరించిన గుండెను విజయవంతంగా దాతకు అమర్చినట్లు వైద్యబృందం ప్రకటించింది. బాధితుడు ఐసీయూలో కోలుకుంటున్నట్లు తెలిపింది. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా గుండె మారి్పడి చికిత్స చేసినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ చికిత్సను నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ సహా ఆస్పత్రి సూపరింటిండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ పర్యవేక్షించారు. కాగా, గుండె దాత, స్వీకర్త ఇద్దరూ ఒకే మండలవాసులు కావడం విశేషం. గుండెదాత వీరబాబు స్వగ్రామం కూసుమంచికాగా, స్వీకర్త పెయింటర్‌ తుపాకుల హుస్సేన్‌(33) స్వగ్రామం కూసుమంచి మండలంలోని మునిగేపల్లి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top