ఏప్రిల్‌ నెలంతా కాంగ్రెస్‌ ఉద్యమాలు 

Congress Will Protest Against Telangana Govt Over Paddy Procurement - Sakshi

ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వాల తీరుకు నిరసన

చివరి వారంలో వరంగల్‌లో రైతు బహిరంగ సభ 

రాహుల్‌ను ఆహ్వానించాలని తీర్మానం 

7న పెట్రో ధరలు, విద్యుత్‌ చార్జీల పెరుగుదలపై ధర్నాలు 

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఏప్రిల్‌ నెలంతా ఉద్యమాలు చేయాలని, ఏప్రిల్‌ చివరి వారంలో వరంగల్‌ కేంద్రంగా రైతు బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) కార్యవర్గం నిర్ణయించింది. ఈ బహిరంగ సభకు ఎంపీ రాహుల్‌ గాంధీని ఆహ్వానించి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని తీర్మానించింది.

టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జూమ్‌ యాప్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. నల్లగొం డ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చై ర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహే శ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌ యాదవ్, గీతారెడ్డిలతో పాటు పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలు, వివిధ చార్జీ ల పెంపు, ధాన్యం కొనుగోళ్లు, భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ, పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.  

ప్రభుత్వాల మోసాన్ని ఎండగట్టాలి 
రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లులను అడ్డగోలుగా పెంచారని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు అంశాలపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టాలని, సీనియర్‌ నేతలంతా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిం చి ప్రజలు, రైతాంగానికి ఈ విషయాలను తెలియజెప్పాలని సూచించారు.

ఏఐసీసీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ గ్యాస్‌ సిలెండర్లకు దండలు వేయడంతో పాటు డప్పులు కొట్టి నిరసనలు తెలపాలని కోరారు. వచ్చే నెల 7వ తేదీన సివిల్‌ సప్లయిస్‌ భవన్, విద్యుత్‌ సౌధల వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.  

శ్రీధర్‌బాబు నేతృత్వంలో కమిటీ 
ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడంలో భాగంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు మాజీ పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో పలువురు సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను పరిరక్షించే జీవో 111 విషయంలో సీఎం కేసీఆర్‌ అస్పష్ట ప్రకటన చేసిన నేపథ్యంలో.

ఈ ప్రకటన ఫలితాలు, ఆయా గ్రామాల ప్రజలపై పడే ప్రభావం తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు పర్యావరణ అంశాలపై అవగాహన ఉన్న మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, దాసోజు శ్రావణ్‌లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇలావుండగా పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో మంచి కృషి చేసి 40 లక్షల పైచిలుకు డిజిటల్‌ సభ్యత్వాలను చేర్పించిన రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు, ఎన్‌రోలర్స్‌ను టీపీసీసీ కార్యవర్గం అభినందించింది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top