పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్‌ అథారిటీలు 

Compliant‌ authorities for complaints against police - Sakshi

రాష్ట్ర స్థాయితోపాటు వరంగల్, హైదరాబాద్‌ రీజియన్లకు విడిగా ఏర్పాటు 

తీవ్ర నేరారోపణలపై నేరుగా ఫిర్యాదుల స్వీకరణ 

విచారణ అనంతరం చర్యల నిమిత్తం డీజీపీకి సిఫారసు 

సాక్షి, హైదరాబాద్‌: విధినిర్వహణలో అసలత్వం, ఏకపక్షంగా వ్యవహరించడం, వేధించడం, బాధితులను పట్టించుకోకపోవడం వంటి పోలీస్‌ మిస్‌ కండక్ట్‌లపై రాష్ట్ర పోలీసు శాఖ కొరడా ఝుళిపించనుంది. పోలీసు శాఖ ప్రతిష్టను పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు పోలీసులపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు పోలీస్‌ కంప్‌లైంట్‌ అథారిటీలను ఏర్పాటు చేసింది. ఫిర్యాదులపై అథారిటీలు విచారణ జరిపి తదనుగుణంగా చర్యలు చేపట్టేందుకుగాను డీజీపీకి సిఫారసు చేస్తాయి. పోలీసు సంస్కరణలపై సుప్రీంకోర్టు ఇదివరకు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీస్‌ కంప్‌లైంట్‌ అథారిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒకటి, వరంగల్, హైదరాబాద్‌ రీజియన్ల వారీగా మరో రెండు కంప్‌లైంట్‌ అథారిటీలను ఏర్పాటు చేస్తూ, వాటికి చైర్మన్లు, సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

అథారిటీల చైర్మన్, సభ్యుల నియామకం 
రాష్ట్ర పోలీస్‌ కంప్‌లైంట్‌ అథారిటీకి చైర్మన్‌గా జస్టిస్‌ విలాస్‌ వి అఫ్జల్‌ పుర్కర్‌ (రిటైర్డ్‌), సభ్యుడిగా విశ్రాం త ఐపీఎస్‌ అధికారి నవీన్‌ చంద్, సభ్యకార్యదర్శిగా శాంతిభద్రతల విభాగం అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ కొనసాగుతారు. హైదరాబాద్‌ రీజియన్‌ పోలీస్‌ కంప్‌లైంట్‌ అథారిటీకి చైర్మన్‌గా విశ్రాంత జిల్లా జడ్జి కె.సంగారెడ్డి, మాజీ ఐపీఎస్‌ అధికారి ఎ.వెంకటేశ్వర్లు, సభ్యకార్యదర్శిగా వెస్ట్‌ జోన్‌ ఐజీ వ్యవహరిస్తారు. వరంగల్‌ రీజియన్‌ పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ చైర్మన్‌గా జిల్లా విశ్రాంత జడ్జి వెంకటరామారావు, విశ్రాంత అడిషనల్‌ కమిషనర్‌ జె.లక్ష్మినారాయణ, సభ్యకార్యదర్శిగా వరంగల్‌ ఐజీ వ్యవహరిస్తారు. డీజీపీ, రాష్ట్ర హెచ్చార్సీ కార్యదర్శి, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (స్పెషల్‌ సి) డిపార్ట్‌మెంట్లు సభ్యులుగా ఉంటారు. వీటి పనితీరు, విధివిధానాలను పోలీసు శాఖ త్వరలో వెలువరించనుంది. 

ఎవరు దేని కిందకు వస్తారు? 
డీఎస్పీ అంతకంటే కిందిస్థాయి పోలీసులపై రీజియన్‌ పోలీసు కంప్‌లైంట్‌ అథారిటీలకు ఫిర్యాదు చేయవచ్చు. అడిషనల్‌ ఎస్పీ అంతకంటే పెద్ద ర్యాంకు పోలీసు అధికారులపై ఫిర్యాదు చేయడానికి స్టేట్‌ పోలీస్‌ కంప్‌లైంట్‌ అథారిటీని ఆశ్రయించవచ్చు. 

విదేశాల్లో చాలా కాలం నుంచే.. 
పోలీసులకు ఉండే అధికారాలు దుర్వినియోగం కాకుండా విదేశాల్లో ఓవర్‌సైట్‌ కమిటీలు ఉన్నాయి. బ్రిటన్, అమెరికా లాంటి విదేశాల్లో స్థానిక విశ్రాంత అధికారులతో వీటిని ఏర్పాటు చేస్తారు. పోలీసులపై వచ్చే ఆరోపణలు, ఫిర్యాదులపై ఇవి విచారణ జరుపుతాయి. పనితీరుపై సమీక్ష, పర్యవేక్షణ కూడా చేస్తాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top