వచ్చే 50 ఏళ్లకు తగ్గట్లుగా రోడ్ల అలైన్‌మెంట్లు: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Says about Road alignments for next 50 years | Sakshi
Sakshi News home page

వచ్చే 50 ఏళ్లకు తగ్గట్లుగా రోడ్ల అలైన్‌మెంట్లు: సీఎం రేవంత్‌

May 7 2025 5:08 AM | Updated on May 7 2025 5:08 AM

CM Revanth Reddy Says about Road alignments for next 50 years

సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌. చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

ఆర్‌ఆర్‌ఆర్, రేడియల్‌ రోడ్ల పనులను వేగవంతం చేయాలి 

శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక పార్కులకు అనుగుణంగా రోడ్లు ఉండాలి 

ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్లుగా రీజనల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌), రేడియల్‌ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణం, వాటికి సంబంధించి జంక్షన్లు, వాటి అనుసంధానం ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం, రేడియల్‌ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణంపై మంగళవారం రాత్రి తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. 

అందుకు సంబంధించిన అలైన్‌మెంట్‌ను పరిశీలించి పలు మార్పులు సూచించారు. అటవీ ప్రాంతం, జలవనరులు, మండల కేంద్రాలు, గ్రామాల విషయంలో ముందుగానే లైడర్‌ సర్వే చేపట్టాలని ఆదేశించారు. అలైన్‌మెంట్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పొరపాట్లకు తావివ్వరాదన్నారు. శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రేడియల్‌ రోడ్లకు రూపకల్పన చేయాలని చెప్పారు. 

గందరగోళానికి తావులేకుండా.. 
ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు రేడియల్‌ రోడ్ల నిర్మాణం ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులు ఆర్‌ఆర్‌ఆర్‌ వెలుపలికి వెళ్లే ప్రాంతంలో తగిన రీతిలో ‘ట్రంపెట్స్‌’నిర్మించాలని.. ఎటువంటి గందరగోళానికి తావులేకుండా, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేకుండా దాటేలా చూడాలన్నారు. హైదరాబాద్‌–శ్రీశైలం జాతీయ రహదారిలో ఎలివేటెడ్‌ కారిడార్‌.. నూతన అలైన్‌మెంట్‌కు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. 

రాజీవ్‌ రహదారికి ప్రత్యామ్నాయంగా ఓఆర్‌ఆర్‌ నుంచి మంచిర్యాల వరకు నూతన రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మార్గంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను పరిశీలించాలన్నారు. 

సమీక్షలో రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రత్యేక కార్యదర్శి హరిచందన, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం అదనపు సీఈవో ఇ.వి. నరసింహారెడ్డి, ఎన్‌హెచ్‌ ప్రాంతీయ అధికారి శివశంకర్‌ పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement