సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామంలో ఇళ్లులేవు.. అనుమతులూ లేవు..

CM KCR Adopted Village Vasalamarri Villagers Concern Over Own Houses - Sakshi

ఆందోళన వ్యక్తం చేస్తున్న వాసాలమర్రి గ్రామస్తులు 

ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్‌ 

ఊరంతటినీ అభివృద్ధి చేస్తానని హామీ 

రెండేళ్ల కిందే రూ.152 కోట్లతో డీపీఆర్‌..  

ఇప్పటికీ నిధులు రాక అడుగుముందుకు పడని పనులు 

త్వరగా ఇళ్లు కట్టించాలని గ్రామస్తుల డిమాండ్‌ 

సొంతంగా కట్టుకునే అనుమతి అయినా ఇవ్వాలని విజ్ఞప్తులు 

సాక్షి, యాదాద్రి:  సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామస్తులు పక్కా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు ఎప్పుడు చేపడతారా అని రెండేళ్లుగా వేచి ఉన్నామని.. ఇప్పటికీ ఇళ్లు, మౌలిక వసతుల నిర్మాణం ప్రారంభమే కాలేదని అంటున్నారు.

కనీసం సొంతంగా కట్టుకునే పర్మిషన్లూ ఇవ్వడం లేదని చెప్తున్నారు. పాత, సగం కూలిపోయిన ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వాపోతున్నారు. వెంటనే ఇళ్లు కట్టించి ఇవ్వాలని, లేకుంటే సొంతంగా కట్టుకునేందుకు అనుమతులైనా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులతో కలిసి ఇటీవల భువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. 

రెండేళ్ల క్రితం దత్తత తీసుకున్న సీఎం 
వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు 2020 నవంబర్‌ 1న సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 2021 జూన్‌ 22న గ్రామసభ నిర్వహించి, స్థానికులతో సహపంక్తి భోజనం చేశారు. బంగారు వాసాలమర్రిగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అంతకుముందు జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక భవనాన్ని ప్రారంభించడానికి వాసాలమర్రి మీదుగా వెళ్తున్న సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ ఎదుట గ్రామస్తులు నిరసన తెలిపే ప్రయత్నం చేశారు.

ఆ విషయం తెలుసుకున్న సీఎం సాయంత్రం తిరుగుప్రయాణంలో గ్రామంలోని రామాలయం వద్ద ఆగి మాట్లాడారు. వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి ప్రత్యేకంగా లేఅవుట్‌ అభివృద్ధి చేసి, ప్రతి కుటుంబానికి డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని ప్రకటించారు. తర్వాత ప్రభుత్వ అధికారులు గ్రామంలో పర్యటించి చేపట్టాల్సిన పనులపై సర్వే చేశారు. రూ.152 కోట్లతో డీపీఆర్‌ను రూపొందించారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. 

481 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక 
వాసాలమర్రిలో ప్రస్తుతం 103 పక్కా ఇళ్లు, మరో 481 పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు, గుడిసెలు ఉన్నాయి. ఈ 481 ఇళ్లను కూల్చివేసి వాటి స్థానంలో పక్కా ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నవారి కోసం జీ ప్లస్‌ వన్, జీ ప్లస్‌ టూ పద్ధతిలో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. అంతర్గత మురుగు కాల్వలు, మంచినీటి ట్యాంకు, పార్కు, ఫంక్షన్‌హాల్, గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, పాఠశాల భవనాలు, పోస్టా­ఫీస్, మినీ మార్కెట్, సబ్‌ సెంటర్‌లను నిర్మించాలని నిర్ణయించారు. గ్రామాన్ని పునర్నిర్మించే క్రమంలో తాత్కాలికంగా ఇళ్లు కూడా నిర్మించాలన్న ఆలోచనకు వచ్చారు. కానీ ఇవేవీ ముందుకుపడలేదు.  

వెంటనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి 
గ్రామంలో 481 పెంకుటిళ్లు కూల్చివేసి డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. రెండేళ్లు అవుతోంది. ఇళ్లను త్వరగా పూర్తి చేయాలనడమేగానీ నిర్మాణం ప్రారంభం కావడం లేదు. గ్రామ అభివృద్ధి కోసం రూ.152 కోట్లతో డీపీఆర్‌ పంపించారు. నిధులు రాలేదు. లేఅవుట్‌ కాలేదు. 50 ఇళ్లు కూలిపోయాయి. నా ఇల్లు కూడా సగం కూలిపోయింది. కొత్తగా కట్టుకుందామంటే పర్మిషన్‌ లేదు.

వెంటనే ఇళ్లు కట్టించాలని, లేకుంటే కట్టుకునే పర్మిషన్‌ అయినా ఇప్పించాలని గ్రామస్తులు పంచాయతీపై ఒత్తిడి తెస్తున్నారు. ఏదైనా సీఎం సార్‌ నిర్ణయం తీసుకోవాలని అధికారులు అంటున్నారు. మూడు విడుతలుగా నిధులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో మౌలిక వసతుల కోసం రూ.58 కోట్లతో మరో డీపీఆర్‌ పంపించామని కలెక్టర్‌ చెప్తున్నారు. త్వరగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. 
– పోగుల ఆంజనేయులు, సర్పంచ్, వాసాలమర్రి 

కొత్త నిర్మాణాలకు పర్మిషన్‌ ఇవ్వలేకపోతున్నాం 
నూతన భవన నిర్మాణాలకు గ్రామ పంచాయతీ పర్మిషన్‌ ఇవ్వలేకపోతున్నాం. గ్రామంలో చాలా మంది పేదలు ఉన్నారు. వానాకాలంలో పాత ఇళ్లు కొన్ని కూలిపోయాయి. కొందరు గుడిసెలలో జీవిస్తున్నారు. ఇటు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వకుండా.. మరోవైపు సొంత డబ్బులతో కట్టుకుందామనుకున్నా అనుమతులు ఇవ్వక పోవడంతో ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. 
– పలుగుల మధు, ఉప సర్పంచ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top