CID Investigating Ramoji Rao And Sailaja Kiran In Hyderabad - Sakshi
Sakshi News home page

రామోజీరావు, శైలజా కిరణ్‌ల సీఐడీ విచారణ.. కీలక ఆధారాలు లభ్యం?

Apr 3 2023 10:38 AM | Updated on Apr 3 2023 8:04 PM

CID Investigating Ramoji Rao And Sailaja Kiran Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మార్గదర్శి అక్రమాలపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. చిట్‌ఫండ్‌ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మా­ర్గ­దర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజాకిరణ్‌ను హైదరాబాద్‌లోని వారి నివాసంలో సీఐడీ అధికారులు సోమవారం విచారించారు.

8 గంటలపాటు కొనసాగిన విచారణలో కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టినట్టుగా తెలుస్తోంది. స్థానిక రెవిన్యూ అధికారులను పిలిచిన సీఐడీ బృందం.. రెవిన్యూ అధికారుల పంచ్ విట్నెస్ తో  సీజింగ్ ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. సీఐడీ ఎస్పీ అమిత్ బర్ధర్ ఆధ్వర్యంలో.. సీఐడీ లీగల్ అడ్వైజర్ సమక్షంలో రామోజీ, శైలజ  విచారణ జరిగింది.

ఇప్పటికే నలుగురు అరెస్ట్‌
కాగా, దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది సీఐడీ.  మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది.   ఈ కేసులో ఇప్పటికే నలుగురు బ్రాంచ్‌ మేనేజర్లను సీఐడీ అరెస్ట్‌ చేసింది. 

మార్గదర్శి చిట్‌ఫండ్‌ సోదాల్లో భారీగా అక్రమాలు గుర్తించారు అధికారులు. మార్గదర్శి రికార్డులన్నీ అక్రమేనని తేల్చిన సీఐడీ.. ఆ మేరకు విచారణకు సిద్ధమైంది. బ్యాలెన్స్‌ షీట్‌ సమర్పించకపోవడంతో పాటు చిట్‌ గ్రూప్‌లకు చెందిన ఫామ్‌ 21ని కూడా మార్గదర్శి సమర్పించలేదు. మొత్తంగా ఏడు మార్గదర్శి బ్రాంచ్‌ల్లో తనిఖీలు చేసి వాటిలో అక్రమాలు గుర్తించారు సీఐడీ అధికారులు. దీనిలో భాగంగానే రామోజీరావు, శైలజాకిరణ్‌లను విచారించడానికి సిద్ధమైంది. ఈ మేరకు రామోజీరావు, శైలజాకిరణ్‌లకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. నేడు విచారణ చేపట్టింది. 

ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్‌విత్‌ 34, కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మేనేజర్లను అరెస్టు చేశారు. 

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా మళ్లించడం ద్వారా రామోజీరావు యథేచ్ఛగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చిట్‌ఫండ్స్‌ చట్టం–1982, రిజర్వ్‌బ్యాంకు చట్టం, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబ­ర్‌ నెలల్లో, హైదరాబాద్‌లోని ప్రధాన కార్యా­ల­యం­లో డిసెంబరులో నిర్వహించిన సోదాలతో ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది.

చదవండి: ‘మార్గదర్శి’ డాక్యుమెంట్లే సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement