అమ్మ ఫొటోకు ముద్దులు: చచ్చిపోయారుగా అందుకే వాళ్లు రారు

Choutuppal Tragedy: 3 Years Toddler Grieve For Deceased Mom Sisters - Sakshi

తేరుకోని కుటుంబం... ఆగని రోదనలు

జ్ఞాపకాలు తలుచుకుంటూ రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు

చిన్నారి మాటలతో కంటతడి పెడుతున్న స్థానికులు 

విషాదంలోనే రాంనగర్‌కాలనీ 

చౌటుప్పల్‌ :  పట్టణ కేంద్రంలోని రాంనగర్‌కాలనీ ఇంకా విషాదంలోనే ఉంది. ముగ్గురు బిడ్డలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికుల కళ్లెదుటే కన్పిస్తోంది. బాధ్యత మరిచి తిరుగుతూ మద్యానికి బానిసైన కుటుంబ పెద్ద  వేధింపుల కారణంగా కుటుంబం బలైంది. ఎక్కడ నలుగురు కలిసినా ఇదే ఘటనపై చర్చించుకుంటున్నారు. ఉమారాణి, హర్షిణీ, లాస్య మృతదేహాలకు  గురువారం రోజు సాయంత్రమే అంత్యక్రియలు జరిగాయి.  ఘటనకు బాధ్యుడైన తొర్పునూరి వెంకటేశం తన భార్యతో పాటు కుమార్తెలకు అంత్యక్రియలు నిర్వహించాడు. ముగ్గురిని ఒకే చితిపై పడుకోబెట్టి దహనసంస్కారాలు చేశారు. ఈ దృశ్యం కుటుంబ సభ్యులు, బంధువులతో పెద్ద సంఖ్యలో వచ్చిన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. 

వెంకటేశం అరెస్ట్‌ .. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు షరతులపై విడుదల
భార్యతో పాటు ఇద్దరు కుమార్తెల మృతికి కారణమైన వెంకటేశంను స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు ఉమారాణి అన్న సందగళ్ల మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్‌ చేశారు. కాగా, తమకు కొంత సమయం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు. ముగ్గురి అంత్యక్రియలు తనే నిర్వహించాడని, అనంతరం జరిగే కార్యక్రమాలు ముగిశాక అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఫిర్యాదుదారుడి  సమ్మతితో పోలీసులు గడువుకు అంగీకరించారు. అనంతరం అతన్ని  కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. 

కన్నీళ్లు పెట్టించిన చిన్నారి మాటలు 
తల్లితో పాటు ఇద్దరు అక్కలను కోల్పోయిన మూడేళ్ల చిన్నారి శైనీ  చెప్పే మాటలు కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను కన్నీళ్లుపెట్టిస్తున్నాయి. పెద్దనాన్నలు, పెద్దమ్మలు, అక్కలు, అన్నలతో రోజువారీ మాదిరిగానే కలివిడిగా ఉంటోంది.  మమ్మి, అక్కలు గుర్తుకు రానంతవరకు బాగానే ఆడుకుంటుంది. కుటుంబ సభ్యుల వద్ద సెల్‌ఫోన్‌ తీసుకొని అందులోని తల్లి, అక్కల ఫొటోలను చూసుకుంటుంది.

తల్లి ఉమారాణి ఫొటోకు ముద్దులు పెట్టిన దృశ్యం అక్కడివారిని కంటతడిపెట్టించింది. మమ్మీ, అక్కలు ఎటువెళ్లారని  అడిగితే ఊయల ఊగి ఊరికి వెళ్లారని చెప్పింది. ఊరికి వెళ్లి మళ్లీ వస్తారా అని అడిగితే చచ్చిపోయారుగా అందుకే వాళ్లు రారు అంటూ అమాయకంగా చెప్పింది. ఆ అమాయకపు మాటలు విన్న కుటుంబీకులు ఘొళ్లుమంటు విలపించారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top