‘బాల భటులు’ సిద్ధం.. దేశ పోలీసు చరిత్రలో తొలిసారి

Child Soldiers From 1650 Public Schools In Telangana State - Sakshi

సైబర్‌ నేరాలపై యుద్ధం

సైబర్‌ కాంగ్రెస్‌ పేరుతో 3 నెలల శిక్షణ 

1,650 స్కూళ్లలో 3,300 మందికి నిర్వహణ 

మంగళవారం నుంచి అధికారికంగా రంగంలోకి

దేశ పోలీసు చరిత్రలో తొలిసారి  

సాక్షి, హైదరాబాద్‌: ‘నేను పొందిన అవగాహన తో నన్ను నేను రక్షించుకోవడంతో పాటు సమాజాన్ని సంరక్షిస్తానని, నా పాఠశాలలో ఉన్న పిల్లలు, పెద్దలు ఎవరైనా సైబర్‌ నేరాల బారిన పడితే వారికి సహాయం చేస్తానని, సలహాలు సూచనలు ఇస్తానని, సైబర్‌ పోలీసులకు, షీ–టీమ్స్‌కు సమాజానికి మధ్య వారధిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నా’ మంగళవారం తెలంగాణలోని 1650 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ‘బాల భటులు’ చేసిన ప్రమాణమిది.

దేశ పోలీసు చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ ప్రయోగం చేశారు. సైబర్‌ నేరాలను నిరోధించడానికి రాష్ట్ర మహిళ భద్రత విభాగం అమల్లోకి తెచ్చిందే ‘సైబర్‌ కాంగ్రెస్‌’. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సైబర్‌ అంబాసిడర్లుగా తీర్చిదిద్దారు. విద్యాశాఖ అధికారులతో కలసి వర్చువల్‌గా 3 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ బాల భటులు మంగళవారం నుంచి అధికారికంగా రంగంలోకి దిగారు.

మొత్తం 33 జిల్లాల్లోని జిల్లా పరిషత్‌ స్కూళ్లలో జరిగిన కార్యక్రమాల్లో బాల భటులకు బ్యాడ్జీలు అందించారు. నగరంలోని మహబూబియా స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి పాల్గొన్నారు. వీరి పర్యవేక్షణలో సైబర్‌ నేరాలపై చైతన్యం, అవగాహన కల్పించేందుకు సైబ్‌–హర్‌ క్యాంపెయినింగ్‌ జరిగింది. దీనికి కొనసాగింపుగా సైబర్‌ కాంగ్రెస్‌ చేపట్టారు.

ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు 
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న పాఠశాలలను 16 యూనిట్లుగా చేశారు. విద్యా శాఖ, పోలీసు విభాగంతో పాటు స్వచ్ఛంద సంస్థ యంగిస్తాన్‌ ఫౌండేషన్‌తో కలసి మహిళా భద్రత విభాగం పని చేసింది. ఒక్కో ప్రభుత్వ పాఠశాల నుంచి 8, 9 తరగతులు చదువుతున్న ఇద్దరిని ఎంపిక చేశారు. వీరికి సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ఇతరుల్లో అవగాహన పెంచడంతో పాటు బాధితులకు సహకరించే విధానాలు నేర్పారు. స్థానిక పోలీసుస్టేషన్లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు అనుసంధానకర్తలుగా పని చేస్తారు.

మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలపై దృష్టి పెట్టారు. సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా చైతన్యం కలిగించడంతో పాటు బాలికల భద్రతకు భంగం వాటిల్లకూడదనే లక్ష్యంతో ముందుకెళ్లారు. ఈ విద్యార్థులకు సైబర్‌ నేరాలపై ప్రతి వారం ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించారు. ఎదురయ్యే సమస్యలను తెలియజేయడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలను నేర్పారు. ఇంటర్నెట్‌ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరిస్తూ విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు.

ఆన్‌లైన్‌ నేపథ్యంలో... 
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు తప్పనిసరయ్యాయి. చేతికి స్మార్ట్‌ఫోన్లు రావ డంతో క్లాసులతో పాటు యాప్‌ల వినియోగం, ఆన్‌ లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడ్డారు. దీన్ని సైబర్‌ నేరగాళ్లు క్యాష్‌ చేసుకోవడంతో అనేకమంది విద్యా ర్థులు సైబర్‌ నేరగాళ్ల వల్లో చిక్కుతున్నారు. పర్యవేక్షణ లేని కొందరు పెడదారి పడుతున్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా ఈ సైబర్‌ అంబాసిడర్లను రంగంలోకి దింపారు.

సుశిక్షితులైన ఈ 3,300 మంది తమను తాము కాపాడుకోవడంతో పాటు సహ విద్యార్థులు, తల్లిదండ్రులు, స్నేహితులు, పరిచయస్తులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పి స్తారు. బాధితులుగా మారిన వారికి పోలీసులు, షీ–టీమ్స్‌ ద్వారా సహాయసహకారాలు అందేలా కృషి చేస్తారు. తొలి విడతలో సైబర్‌ అంబాసిడర్లుగా మారిన 3,300 మందిలో 1,500 మంది బాలురు కాగా, 1,800 మంది బాలికలు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top