Hyd: చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు | Chicken Waste Smuggling Racket Busted In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyd: చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

Jun 8 2026 7:53 PM | Updated on Jun 8 2026 8:23 PM

Chicken Waste Smuggling Racket Busted In Hyderabad
  • హెచ్-ఫాస్ట్ -జీహెచ్‌ఎంసీ ఉమ్మడి దాడి
  • 90 టన్నుల వ్యర్థాలు, 7 వాహనాలు స్వాధీనం

 

హైదరాబాద్: ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగించే అంతర్-రాష్ట్ర చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సిటీ పోలీస్ కింద పనిచేసే 'హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్' (H-FAST), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ వైద్యుల బృందం ఉమ్మడిగా దాడి చేసి రట్టు చేశాయి.

నమ్మకమైన సమాచారం మేరకు సోమవారం(జూన్‌ 8వ తేదీ) తెల్లవారుజామున ఉమ్మడి బృందాలు అంబర్‌పేట్, కుల్సుంపురా, అత్తాపూర్ మరియు రాజేంద్రనగర్ పరిధిలోని చికెన్ వ్యర్థాల రవాణా గోదాములపై ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. 

ఈ ఆపరేషన్‌లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 7 నాలుగు చక్రాల రవాణా వాహనాలను పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలలో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న సుమారు 90 టన్నుల పచ్చి చికెన్ వ్యర్థాలను (Poultry Waste) గుర్తించి సీజ్ చేశారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్వాహకులు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న వివిధ చికెన్ షాపుల నుండి ఈ వ్యర్థాలను సేకరిస్తున్నట్లు తేలింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఈ వ్యర్థాలను చెంగిచెర్లలోని రెండరింగ్ పాయింట్‌కు తరలించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేదా అనుమతులు లేకుండా, వాణిజ్య చేపల చెరువుల్లో మేతగా ఉపయోగించడం కోసం వీటిని ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి (పశ్చిమ గోదావరి జిల్లా) ప్రాంతాలకు, అలాగే నల్గొండలోని మాల్ టౌన్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, కఠిన చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. స్వాధీనం చేసుకున్న సుమారు 90 టన్నుల చికెన్ వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో నిర్దేశిత నిబంధనల ప్రకారం సురక్షితంగా పారదోలారు (

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్  గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ సుదీర్ఘ ఆపరేషన్ జరిగింది. హెచ్-ఫాస్ట్ ఇన్‌స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్, ఎమ్. అంజయ్యలతో పాటు సబ్-ఇన్‌స్పెక్టర్లు, హెచ్-ఫాస్ట్ సిబ్బంది, జీహెచ్‌ఎంసీ వెటర్నరీ వైద్యులు ఈ దాడులలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు.

ప్రజలకు,వ్యాపారులకు ముఖ్య హెచ్చరిక
పచ్చి చికెన్ వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడం మరియు వాణిజ్య చేపల చెరువుల్లో వాటిని ఆహారంగా వేయడం పూర్తిగా నిషేధించబడింది. ఇటువంటి అత్యంత అపరిశుభ్రమైన పద్ధతుల వల్ల ఆహార గొలుసు (Food Chain) లోకి ప్రమాదకరమైన బయోలాజికల్ బ్యాక్టీరియా/విషపదార్థాలు ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థాలను తిని పెరిగిన చేపలను తినడం వల్ల మనుషులకు క్యాన్సర్ (Carcinogenic) వచ్చే ప్రమాదం ఉంది. ఇది ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరం.

అందుచేత చికెన్ వ్యాపారులు, ప్రజలు ఎవరైనా ఇటువంటి అక్రమ నిల్వలు, వ్యర్థాల తరలింపులను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించి ప్రజారోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement