రామచంద్రాపురం, నాచారం ఈఎస్‌ఐసీలు త్వరలో ప్రారంభం

Central Govt Committed To Modernize ESIC Hospitals In Country: Bhupender Yadav - Sakshi

సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల స్నాతకోత్సవంలో కేంద్రమంత్రి భూపేందర్‌ 

ఈఎస్‌ఐసీ సిబ్బంది సేవలు ఎనలేనివి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐసీ ఆస్పత్రుల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, తదనుగుణంగా నగరంలోని ఈఎస్‌ఐసీ కోసం కొత్త క్యాథ్‌ల్యాబ్, న్యూక్లియర్‌ మెడిసిన్‌ ల్యాబ్‌ను అందించామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. శ్రీనగర్‌ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమమ్‌ ఆడిటోరియంలో శనివారం జరిగిన సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల స్నాతకోత్సవానికి భూపేందర్‌తో పాటు కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, రామేశ్వర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ వైద్యకళాశాల నుంచి వచ్చిన ఎంబీబీఎస్‌ తొలిబ్యాచ్‌ (2016–2017) వైద్యులకు డిగ్రీలను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా భూపేందర్‌ యాదవ్‌ మాట్లాడుతూ..ఈఎస్‌ఐసీల అభివృద్ధి కోసం 9 ప్రణాళికలను రూపొందిం చామని అందులో భాగంగా రామచంద్రాపురం, నాచారంలో ఏర్పాటు చేసిన కొత్త ఈఎస్‌ఐసీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వాటిని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. రామగుండం, శంషాబాద్, సంగారెడ్డిలో 100 పడకల ఆస్పత్రులు నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. యోగా దినోత్సవం సందర్భంగా 160 ఈఎస్‌ఐసీ కేంద్రాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈఎస్‌ఐసీ ఆస్పత్రి సిబ్బంది అంకితభావం, నాణ్యమైన వైద్య సేవల పట్ల కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్‌–19 సమయంలో ఈఎస్‌ఐసీ లబ్ధిదారులకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా నిస్వార్థ సేవలు అందించిందని కొనియాడారు. స్వస్త్‌ భారత్‌ దిశగా పని చేయాలని వైద్యులకు రామేశ్వర్‌ సూచించారు. స్నాతకోత్సవంలో వైద్యులు ఎన్‌.కృష్ణశ్రీ ఎనిమిది, ఎం.లక్ష్మీ లాస్య, కె.అన్నపూర్ణ, పీవీఎస్‌ లలిత సాయిశ్రీలు ఐదేసి చొప్పున స్వర్ణ పతకాలను అందుకున్నారు. కార్యక్రమంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్‌ బరత్వాల్, ఈఎస్‌ఐసీ సంచాలకుడు జనరల్‌ ముఖ్మీత్‌ ఎస్‌.భాటియా, మెడికల్‌ కమిషనర్‌ డాక్టర్‌ అన్షు చబ్రా తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top