ఆధ్యాత్మికత ముసుగులో వేధింపులు.. గురూజీ అసభ్య మెసేజ్‌లు | Case Registered Against Sri Chaitanya Guruji Sunil Reddy | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికత ముసుగులో వేధింపులు.. గురూజీ అసభ్య మెసేజ్‌లు

Oct 14 2026 10:43 AM | Updated on Oct 14 2026 10:45 AM

Case Registered Against Sri Chaitanya Guruji Sunil Reddy

సాక్షి, హైదరాబాద్‌: ఆధ్యాత్మిక సాధనల పేరుతో ఓ వివాహితకు అసభ్యకర సందేశాలు పంపుతూ, ఆమె భర్తను చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీచైతన్య గురూజీ అలియాస్‌ మేరెడ్డి సునీల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 71లో శ్రీవిద్యా సాధనా సెంటర్‌ను సునీల్‌ రెడ్డి నిర్వహిస్తున్నారు. సునీల్‌రెడ్డి వేధింపుల కారణంగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కుటుంబంలో కలకలం రేపింది.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10, స్రవంతి నగర్‌కు చెందిన విష్ణుదీప్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య శ్రీవిద్యా సాధనా సెంటర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం నిర్వాహకుడైన మేరెడ్డి సునీల్‌రెడ్డి ఆధ్యాత్మిక సాధనల పేరుతో ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నారని బాధితురాలి భర్త ఆరోపించారు. ఆ తర్వాత తన భార్యకు సునీల్‌రెడ్డి తరచూ అసభ్యకర సందేశాలు పంపుతూ, వ్యక్తిగత సంభాషణలు జరిపేవారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారం తన దృష్టికి రావడంతో భార్యకు పంపిన సందేశాల గురించి తెలుసుకుని ఆందోళనకు గురైనట్లు తెలిపారు.

నిలదీస్తే చంపేస్తానని బెదిరింపులు?
తన భార్యకు సందేశాలు పంపుతున్న విషయంపై విష్ణుదీప్‌రెడ్డి సాధనా కేంద్రానికి వెళ్లి ప్రశ్నించారు. అక్కడ సునీల్‌రెడ్డిని నిలదీయగా, ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన జీవితాన్ని నాశనం చేస్తానని, మరోసారి అటువైపు వస్తే చంపేస్తానని బెదిరించినట్లు విష్ణుదీప్‌రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలతో తమ వైవాహిక జీవితంలో తీవ్ర గందరగోళం ఏర్పడిందని పేర్కొన్నట్లు సమాచారం. తన భార్యకు పంపిన సందేశాలు, బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను సేకరించిన ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు సునీల్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

బీఎన్‌ఎస్‌ 351(2) కింద కేసు
విష్ణుదీప్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న బెదిరింపుల అంశానికి సంబంధించి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్‌ 351(2) కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్‌ నేరపూరిత బెదిరింపులకు సంబంధించినది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: హనుమకొండలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement