ఆధిపత్య పోరుకు ‘చెక్‌’! | Cancel Deputy Sarpanch Cheque Power Discussions: Telangana | Sakshi
Sakshi News home page

ఆధిపత్య పోరుకు ‘చెక్‌’!

May 17 2026 1:04 AM | Updated on May 17 2026 1:04 AM

Cancel Deputy Sarpanch Cheque Power Discussions: Telangana

ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ రద్దు దిశగా చర్యలు? 

రాష్ట్ర సర్కార్‌కు పీఆర్‌ఆర్‌డీ శాఖ ప్రతిపాదనలు 

అభివృద్ధికి ఆటంకం కలుగుతోందనే ఫిర్యాదులపై దృష్టి 

ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే ప్రతిపాదనలు కార్యరూపం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఉండగా, ఉప సర్పంచ్‌లకున్న చెక్‌ పవర్‌ రద్దుకు చర్యలు మొదలైనట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న చెక్‌ పవర్‌ సమస్యకు ఓ పరిష్కారం చూపే దిశలో ప్రయత్నాలు ఊపందుకున్నట్టుగా తెలుస్తోంది. ఉప సర్పంచ్‌ స్థానంలో పంచాయతీ కార్యదర్శికి చెక్‌ పవర్‌ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి చెక్‌ పవర్‌ వినియోగం విషయంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు చెక్‌ పెట్టడమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని తెలిపాయి. 

అసెంబ్లీలో చట్ట సవరణ చేయాలి 
ఉప సర్పంచ్‌లకున్న చెక్‌ పవర్‌ రద్దు కావాలంటే తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం–2018 కి సవరణలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఈ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు లేని పక్షంలో గవర్నర్‌ ద్వారా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఈ మార్పును అమలు చేసేందుకు వీలుంటుంది. అయితే ఆ తర్వాత ఆరు నెలల్లోగా అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. 

ఉప సర్పంచ్‌ స్థానంలో పంచాయతీ కార్యదర్శికి చెక్‌ పవర్‌ ఇవ్వడం వల్ల పంచాయతీరాజ్‌ శాఖ ప్రతినిధిగా జవాబుదారీతనంతో పాటు నిధుల దుర్వీనియోగం వాటిల్లితే అతడినే బాధ్యుడిని చేసి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో రాజకీయ నాయకుల మధ్య గొడవలతో అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే ఇదే సరైన మార్గమని అధికారులు భావిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంతకాలతోనే నిధుల లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కూడా 2018కి ముందు ఇదే పద్ధతి అమల్లో ఉండగా, గత ప్రభుత్వం ఉప సర్పంచ్‌లకు ఈ అధికారాన్ని కల్పించింది. 

అభివృద్ధికి ఆటంకం ఫిర్యాదులతో..  
సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ల మధ్య ఆధిపత్య పోరు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు అడ్డంకిగా మారినట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడడం, సకాలంలో నిధులు, బిల్లులు విడుదల కాకపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జాయింట్‌ చెక్‌ పవర్‌ విధానం వల్ల సర్పంచ్‌లు–ఉప సర్పంచ్‌లు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు/అధికారుల మధ్య కోల్డ్‌వార్‌ సాగుతున్నట్టుగా వస్తున్న వార్తలపై పీఆర్‌ఆర్‌డీ శాఖ అప్రమత్తమైంది. మళ్లీ పాత పద్ధతిలోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ఉమ్మడి సంతక అధికారాలు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు విశ్వసనీయ సమాచారం.  

నిధుల విడుదల, చెల్లింపులో ప్రతిష్టంభన 
ప్రస్తుతం అమల్లో ఉన్న నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం..గ్రామాల్లో ఏ ఖర్చు చేయాలన్నా సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌ సంతకం తప్పనిసరి. అయితే అత్యధిక శాతం గ్రామాల్లో వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడడం, ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన వారైతే ఈ సమస్య మరింత జఠిలంగా మారుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారైనప్పటికీ వర్గ పోరు కారణంగా నిధుల విడుదల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడుతోందనే విమర్శలున్నాయి. కొన్ని గ్రామాల్లో ఉప సర్పంచులు సంతకం పెట్టాలంటే కమీషన్లు డిమాండ్‌ చేస్తున్నారని, లేదంటే బిల్లులు ఆపేస్తున్నారనే ఆరోపణలుండగా, సర్పంచులతో పాటు డీపీవోలు, ఇతర అధికారుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందినట్టుగా తెలిసింది.

ఏకాభిప్రాయం కొరవడటంతో నిధుల విడుదల, బిల్లులు చెల్లింపు వంటి వాటిలో ఎడతెగని జాప్యం చేసుకుంటోందనే ఫిర్యాదులు అందినట్టు సమాచారం. చివరకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి సకాలంలో యుటిలైజేషన్‌ సర్టీఫికెట్లు సమర్పించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన తదుపరి నిధుల విడుదల కూడా ఆలస్యమవుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచి్చనట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ శాఖ తాజా ప్రతిపాదనలు చేసిందని, అయితే దీనిపై ప్రభుత్వం కచి్చతమైన నిర్ణయం తీసుకుంటేనే చట్ట సవరణ ఇతర విషయాల్లో ముందడుగు పడుతుందని అధికారులంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement