
రిజర్వేషన్లు 50 శాతం మించకుండా 2018లో బీఆర్‌ఎస్ చట్టం చేసింది
కేంద్రంలోని బీజేపీప్రభుత్వం చట్టం కాకుండా నిలిపివేసింది: భట్టి విక్రమార్క
42 శాతం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలే అడ్డుకున్నాయని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు కాకుండా ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో గురువారం గాం«దీభవన్‌లో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
2018లో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్ 50 శాతం మించకుండా చట్టం చేసిందని, అదే ఉరితాడుగా తయారైందని అన్నారు. 2019లో ఎన్నికలు జరిపిన వెంటనే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కులగణన చేసి జీవో ఇచ్చేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే ఎంపిరికల్ డాటా అవసరమని హైకోర్టు చేసిన సూచనతోనే ప్రభుత్వం సైంటిఫిక్‌గా అధ్యయనం చేసి జీవో 9 తీసుకొచ్చిందన్నారు. బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పంపితే బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం దానిని చట్టం కాకుండా నిలిపివేసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్, బీజేపీ కూడబలుక్కొని బీసీల నోటికాడి ముద్దను దూరం చేశాయన్నారు.
రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలనేది కాంగ్రెస్ ఆలోచన: మహేశ్‌గౌడ్
కాంగ్రెస్ పార్టీ కోర్టులను, చట్టాలను గౌరవిస్తుందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో చట్టబద్ధంగా ఎన్నికలకు వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. కోర్టు తీర్పు వచ్చిన తరువాత పరిశీలించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్‌ఎస్ కుటిలయత్నాలు చేస్తున్నాయని, అడుగడుగునా బీసీలను అణగదొక్కిన పార్టీ బీఆర్‌ఎస్ అని ఆరోపించారు.
రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
పొన్నం, జూపల్లి, వాకిటి శ్రీహరి
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తరువాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రులు తెలిపారు. చట్టపరంగా, న్యాయపరంగా బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి చెప్పారు. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించడంతో పాటు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి.. మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి.. బీసీ బిల్లుకు అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్‌కు పంపించామని గుర్తు చేశారు.
అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం బాధాకరమని జూపల్లి అన్నారు. బీసీలకు నోటికాడికి వచ్చిన ముద్ద లాగేసినట్లు చేశారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో తెలంగాణలోని బీసీలంతా ఆలోచించాలని వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.