యాసంగికి రుణాలిచ్చేందుకు కొందరు బ్యాంకర్ల నిరాకరణ

Banks Refuse To Lend Loans To Yasangi In Telangana - Sakshi

ఇతర పంటలు సాగు చేస్తే ఇస్తామని స్పష్టీకరణ

పంటల ప్రణాళిక ఖరారు కాకపోవడంతో కొర్రీలు..

సీజన్‌ మొదలై రెండు నెలలైనా ఇప్పటికి 20 శాతమే లోన్లు

వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

యాసంగి రుణ లక్ష్యం రూ.23,775 కోట్లు 

ఇప్పటివరకు ఇచ్చింది రూ.4,755 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: యాసంగిలో వరిసాగుపై కొనసాగుతున్న సందిగ్ధత పంట రుణాలపై ప్రభావం చూపిస్తోంది. కొన్నిచోట్ల బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. వరి వేయొద్దని ప్రభుత్వం చెబుతుం టే, ఆ పంటకు తాము రుణం ఎలా ఇస్తామని బ్యాంకు అధికారులు ప్రశ్ని స్తున్నారు. ఇతర పంటలు వేస్తే ఇస్తామంటున్నారు.

ఒకపక్క వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు యాసంగిలో రైతులకు వరి విత్తనాలు అమ్మొద్దంటూ కంపెనీలను హెచ్చరిస్తున్నారు. అమ్మితే లైసెన్సులు రద్దు చేస్తామంటూ డీలర్లకు వార్నింగ్‌ ఇస్తున్నారు. మరోవైపు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉన్నతస్థాయి ఆదేశాలు ఏవీ రాకపోయినా, అక్కడక్కడ కొందరు బ్యాంకర్లు ఇలా వ్యవహరించడంపై వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి.

స్పష్టత లేకపోవడంతో..
యాసంగి ప్రారంభమై రెండు నెలలు కావొస్తోంది. ఈ సీజన్‌లో వరి వేయవద్దని, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకున్నవారు మాత్రమే వేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. కానీ వ్యవసాయ శాఖ ఇప్పటివరకు ఎలాంటి పంటల ప్రణాళిక విడుదల చేయలేదు. గత యాసంగిలో ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అయితే ఈసారి వరి వద్దంటున్న ప్రభుత్వం.. సాగు విస్తీర్ణం ఎంతమేరకు తగ్గించనుందో స్పష్టత ఇవ్వలేదు.

దీంతో రైతులు, బ్యాంకర్లలో అయోమయం నెలకొంది. ప్రత్యామ్నాయ పంటలు వేయాలటూ కొన్ని పంటలను సర్కారు సూచించినా.. ఆయా విత్తనాలు సరిపడా సరఫరా చేసే పరిస్థితి లేదు. ఈ విషయంపై రైతులు అడుగుతున్నా ఏఈవోలు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితి పంట రుణాల మంజూరుపైనా ప్రభావం చూపిస్తోంది. 

వారం పదిరోజుల్లో వరినాట్లు!
2021–22 రెండు సీజన్లలో రూ.59,440 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఈ వానాకాలం సీజన్‌ లక్ష్యం రూ. 35,665 కోట్లు కాగా, యాసంగిలో రూ.23,775 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ యాసంగిలో ఇప్పటివరకు రూ.4,755 కోట్ల (20%) వరకు మాత్రమే పంట రుణాలు ఇచ్చారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. పంటల సాగుపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాక రుణాలు ఇస్తామని బ్యాంకర్లు చెబుతున్నారని కొన్ని ప్రాంతాల రైతులు వాపోతున్నారు.

వచ్చేనెల మొదటి వారం అంటే వారం పది రోజుల్లో వరి నాట్లు మొదలవ్వాల్సి ఉండగా.. ఇప్పటికీ రుణాలు ఇవ్వకపోతే ఎలాగని రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులు సహకరించకపోవడంతో చాలాచోట్ల రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంట రుణాల మంజూరును ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన వ్యవసాయ శాఖ యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రత్యామ్నాయ పంటలపైనా..
వరికి బదులు ప్రభుత్వం వేరుశనగ, శనగ, పెసర, మినుములు, ఆవాలు, నువ్వులు, కుసుమలు, ఆముదాలు, పొద్దుతిరుగుడుతో పాటు జొన్న సాగు చేయాలని చెబుతోంది. అయితే ఏపంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో ఇప్పటివరకు చెప్పలేదు. సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేదు. ఇతర ఏర్పాట్లు ఏవీ చేయలేదు. ఎరువులూ సరిపడా సరఫరా కాలేదు. ఇలా యాసంగి సీజన్‌ మొత్తం గందరగోళంగా, రైతుకు పరీక్షగా మారింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top