
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యాలే నాగులు మరణానికి కారణమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. బండి సంజయ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోనే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం వల్లనే రాష్ట్రం లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని మండిపడ్డారు.
ఇది చాలా దురదృష్టకర సంఘటన అని ఆవేదన వక్తం చేశారు. గతంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే, నేడు బ్రతకలేక ఆత్మ హత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. కాగా మరణించిన నాగులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేడు తెలంగాణలో ఉన్నటువంటి దుస్థితికి నాగులు మరణం అద్దం పడుతుందని పేర్కొన్నారు. (చదవండి: దమ్ముంటే పాతబస్తీకి వెళ్లి చూడాలి)