ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జే లేబర్‌ వార్డు! | Army Chief commends Major who helped woman deliver baby at Jhansi railway station | Sakshi
Sakshi News home page

ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జే లేబర్‌ వార్డు!

Jul 9 2025 9:45 AM | Updated on Jul 9 2025 11:37 AM

Army Chief commends Major who helped woman deliver baby at Jhansi railway station

మహారాష్ట్ర మహిళకు కాన్పు చేసిన ఆర్మీ డాక్టర్‌ 

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో ఉదంతం

 వైద్యుడు మేజర్‌ రోహిత్‌ స్వస్థలం హైదరాబాద్‌ 

గత శనివారం ఘటన, సోషల్‌మీడియాలో వైరల్‌

సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మిలటరీ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌ వాసి మేజర్‌ రోహిత్‌ బచ్‌వాలా మహారాష్ట్రకు చెందిన ఓ మహిళను కాపాడటానికి రైల్వే స్టేషన్‌ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌ని లేబర్‌ వార్డుగా మార్చారు. పురిటినొప్పులతో తీవ్ర ఇబ్బందిపడుతున్న ఆమెకు తన వద్ద ఉన్న సాధారణ ఉపకరణాలతో పురుడుపోశారు. వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్ర పన్వేల్‌ ప్రాంతానికి చెందిన నిండు గర్భిణి అశ్వర్‌ ఫలక్‌ తన భర్త జుబేర్‌ ఖురేషీ కుమారుడితో కలిసి గత శుక్రవారం పన్వేల్‌–గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. తన భర్త  స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకీ ప్రయాణమయ్యారు. 

వీరి రైలు గత శనివారం మధ్యాహ్నం ఝూన్సీ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో ఫలక్‌కు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. విషయం గుర్తించిన రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ మహిళా టీటీఈ, ఇతర సిబ్బందిని వీల్‌చైర్‌తో ప్లాట్‌ఫామ్‌పై సిద్ధంగా ఉంచారు. అదే సమయంలో ఆర్మీ మెడికల్‌ కారŠప్స్‌లో (ఏఎంసీ) మెడికల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ రోహిత్‌ హైదరాబాద్‌లోని కుటుంబం వద్దకు రావడానికి శనివారం మధ్యాహ్నం ఝాన్సీ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ గర్భిణికి పురిటినొప్పులు వస్తున్న విషయం తెలుసుకుని ఆమెకు పురుడు పోసేందుకు సిద్ధమయ్యారు. 

ఆమెను ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌ పైన పడుకోబెట్టి..తన జేబులో ఉన్న పాకెట్‌ నైఫ్, మహిళా టీటీఈకి చెందిన హెయిర్‌ క్లిప్స్‌తో పాటు ఆ సమీపంలో ఉన్న వ్యక్తి నుంచి తీసుకున్న ధోవతిలతో ఆ పని ప్రారంభించారు. దాదాపు 20 నిమిషాలు శ్రమించిన రోహిత్‌ ఈ క్రతువు పూర్తి చేయగా..ఫలక్‌ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ లోపు అక్కడకు చేరుకున్న అంబులెన్స్‌ను వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. ఆ తల్లీబిడ్డలకు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు. ఈ హడావుడి పూర్తయ్యే సమయానికి రోహిత్‌ ఎక్కాల్సిన రైలు వెళ్లిపోవడంతో ఆయన మళ్లీ మిలటరీ ఆస్పత్రికి వెళ్లిపోయారు.  

అభినందించిన ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర.. 
రైల్వే స్టేషన్‌లో ఇబ్బందికర పరిస్థితుల్లో కనిపించిన మహిళకు సాయం చేయడానికి సిద్ధమవడంతో పాటు తన ప్రయాణాన్నీ మానుకుని కాన్పు చేసిన మేజర్‌ రోహిత్‌ను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది సోమవారం అభినందించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఈ విషయాన్ని పొందుపరిచారు. ఈ వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement