ఆ జైలు భలే భలే.. అడిగినప్పుడల్లా వీడియో కాల్‌.. కోరినప్పుడల్లా..

Allegations On Sangareddy District Jail Officials - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కోరినప్పుడల్లా బిర్యానీ.. ప్రత్యేక మెనూతో భోజనాలు.. అడిగిన వెంటనే వీడియోకాల్‌.. బోర్‌ కొడితే ఆసుపత్రిలో హెల్త్‌ చెకప్‌ పేరుతో బయట షికార్లు.. సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న కొందరు ఖరీదైన ఖైదీలకు అందుతున్న రాజభోగాలివి.. ఈ సౌకర్యాలు కల్పించినందుకు జైలులో కొందరు అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ముడుపుల పంపకాల్లో తేడాలు రావడంతో ఇద్దరు అధికారులు పరస్పరం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వ్యవహరంపై ఇటీవల అంతర్గత విచారణ చేపట్టిన జైళ్లశాఖ డీఐజీ మురళీబాబు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఈ నివేదిక మేరకు త్వరలో సంబంధిత అధికారులపై చర్యలుండే అవకాశాలున్నట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

చదవండి: ఎంతటి విషాదం.. స్కూటీపై వెళుతుండగానే గుండెపోటు.. అక్కడికక్కడే

వరంగల్‌ జైలు ఎత్తివేయడం, ఇటీవల కాలంలో ఎన్‌డీపీఎస్‌ కేసులు పెరిగిపోవడంతో రాష్ట్రంలో వివిధ జైళ్లలో రిమాండ్‌ ఖైదీల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో చర్లపల్లి, కూకట్‌పల్లి జైలు నుంచి కొందరు రిమాండ్‌ ఖైదీలను సంగారెడ్డి జైలుకు తరలిస్తున్నారు. దీంతో ఈ జైలు రిమాండ్‌ ఖైదీలతో కిక్కిరిసిపోయింది.

సుమారు 300 మంది నుంచి 350 వరకు ఖైదీల సామర్థ్యం కలిగిన ఈ జైలులో ప్రస్తుతం 600 పైగా ఖైదీలున్నారు.హైదరాబాద్‌ పరిధిలో వివిధ కేసుల్లో రిమాండ్‌ తరలించిన ఖరీదైన ఖైదీల తాకిడి పెరిగింది.

ఇది ఇక్కడి జైలు అధికారులకు వరంగా మారింది. వారికి నిబంధనలకు విరుద్ధంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల కూకట్‌పల్లికి చెందిన ఓ రియల్టర్‌ రిమాండ్‌ నిమిత్తం ఈ జైలుకు తలిస్తే జైలులోకి కొందరు అధికారులు రియల్టర్‌ రిమాండ్‌ ఖైదీకి సకల సౌకర్యాలు కల్పించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.

ఓ పారిశ్రామికవేత్త హత్యకేసులో నిందితులను కూడా ఈ జైలుకే రిమాండ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఖరీదైన ఈ నిందితులకు కూడా రాజభోగాలు కల్పించి పెద్ద మొత్తంలో దండుకున్నారనే విమర్శలున్నాయి.

జైలు నుంచే మొరం తవ్వకాలు 
ఈ జైలు ఆవరణ నుంచి పెద్ద మొత్తంలో మొరం అక్రమ తవ్వకాలు జరిగాయి. భద్రతా సిబ్బంది కాపలా కాసే గోడకు అత్యంత సమీపంలోని జైలు స్థలం నుంచి భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టినా ఈ జైలు ఉన్నతాధికారులు కిమ్మనలేదు.  
ఈ వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మొక్కుబడిగా స్థానిక పోలీసులకు జైలు అధికారులు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఆ కేసు ఊసేలేదు. సంబంధిత అధికారిపై కనీస చర్యలు లేవు.

అంతర్గత విచారణ 
అక్రమాలకు నిలయంగా మారిన సంగారెడ్డి జైలులో జరుగుతున్న వ్యవహారాలపై ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో ఆశాఖ డీఐజీ ఇటీవల అంతర్గత విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ అంతర్గత విచారణ తూతూ మంత్రంగా సాగిందా, జైలులో జరుగుతున్న అక్రమాలపై విచారణ పకడ్బందీగా జరిగిందా అనేది ఆశాఖ తదుపరి చర్యలబట్టి స్పష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

నివేదిక ఇచ్చాం 
సాధారణ తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా జైలును ఇటీవల ఆకస్మిక తనిఖీ చేశాం. ఇద్దరు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. విచారణ చేపట్టి, ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. నిబంధనల మేరకు జైలు క్యాంటీన్‌లో బిర్యానీ ఇస్తారు. వీడియోకాల్, హెల్త్‌ చెకప్‌లు ఉంటాయి. నిబంధనలు అతిక్రమించి ఈ సౌకర్యాలు కల్పించినట్లు మా దృష్టికైతే రాలేదు.
– మురళీబాబు, జైళ్లశాఖ డీఐజీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top